మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నూతన చిత్రం ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది. ఆయన 32వ చిత్రమిది (Gopichand 32 Movie). చిత్రాలయము స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వేణు దోనెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్ర హీరోలతో విజయవంతమైన చిత్రాలు తీసిన శ్రీను వైట్ల, కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
గోపీచంద్, శ్రీను వైట్ల కలయికలో మొదటి చిత్రమిది. ఈ రోజు పూజతో లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. హీరో గోపీచంద్ మీద చిత్రీకరించిన ముహూర్తపు / తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, కృష్ణ సోదరులు - నిర్మాత ఆదిశేషగిరి రావు, రమేష్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. సినిమా విజయవంతం కావాలని, చిత్రాలయము స్టూడియోస్ సంస్థకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.
సూపర్ స్టార్ కృష్ణ ఆశీర్వాదంతో...
గోపీచంద్ 32 సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వేణు దోనెపూడి (Venu Donepudi) మాట్లాడుతూ ''దివంగత కథానాయకుడు, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదంతో మా చిత్రాలయము స్టూడియోస్ ప్రారంభించాం. అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయాలనేది మా లక్ష్యం. గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా మా సంస్థలో మొదటి సినిమా. మెజారిటీ సన్నివేశాలను విదేశాల్లో షూటింగ్ చేస్తాం. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్'' అని చెప్పారు.
Also Read : 'జవాన్'లో షారుఖ్ డూప్‌గా నటించింది ఈయనే - సేమ్ టు సేమ్ షారుఖ్‌లా
ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు ఆయన రైటింగ్ విభాగంలో పని చేశారు. శ్రీను వైట్ల తీసిన సూపర్ హిట్ సినిమాలు 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను' చిత్రాలకు గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందించడమే కాదు... 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలకు కథలు సైతం అందించారు. గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా పని చేశారు.
'ఆర్ఎక్స్ 100', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ'తో పాటు కొన్ని చిత్రాలకు మంచి బాణీలు, నేపథ్య సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలో ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను వెల్లడిస్తామని నిర్మాత వేణు దోనెపూడి తెలిపారు.
Also Read : షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?
అక్కినేని నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, రామ్ వంటి హీరోలతో శ్రీను వైట్ల గతంలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. అయితే, ఆయన తీసిన లాస్ట్ సినిమాలు కొన్ని విజయాలు సాధించలేదు. దాంతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని కొంత విరామం తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఆయనకు మళ్ళీ విజయాలు రావాలని ఆశిద్దాం!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial