ఘంటసాల (Ghantasala Venkateswara Rao) గానం వినని తెలుగు ప్రజలు ఉండాలని చెబితే అస్సలు అతిశయోక్తి కాదు. అమర గాయకుడిగా అందరి హృదయాలలో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరం. అటువంటి మహనీయుడు జీవితం మీద రూపొందించిన బయోపిక్ 'ఘంటసాల ది గ్రేట్' (Ghantasala The Great). మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ రోజు రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు.
ఫిబ్రవరి 14న థియేటర్లలోకి ఘంటసాల ది గ్రేట్!
Ghantasala The Great Release Date: ఘంటసాల వెంకటేశ్వర రావు పాత్రలో గాయకుడు కృష్ణ చైతన్య, ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించగా... 'ఘంటసాల ది గ్రేట్' చిత్రానికి సిహెచ్ రామారావు దర్శకత్వం వహించారు. సతీమణి సిహెచ్ ఫణీతో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నట్లు ఈ రోజు హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు.
తెలుగు ప్రజల కర్తవ్యం ఈ సినిమా చూడటం!
ఘంటసాల బయోపిక్ చూడడం తెలుగు ప్రజల కర్తవ్యం అని ఎం వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన ప్రయాణం... భావితరాలకు ఎంతో స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఘంటసాల మీద సినిమా తీయడం సాహసం అని పేర్కొన్న వెంకయ్య... ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచించకుండా ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించేందుకు, వెండితెరపై ఒక సుమధుర గాయకుడి జీవితాన్ని ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నంగా ఈ సినిమాను చూడాలని ఆయన వివరించారు.
ఘంటసాల కేవలం అమర గాయకుడు మాత్రమే కాదు అని, స్వతంత్ర సంగ్రామంలో దేశం తరఫున పాల్గొన్నారని, అటువంటి మహనీయుని జీవితం మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా రామారావు, ఫణి దంపతులు సినిమా తీశారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులు ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్!
ఘంటసాలకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) డిమాండ్ చేశారు. ఉత్తరాదిలో కొంత మంది గాయకులకు భారతరత్న ఇచ్చారని, ఘంటసాలకు ఎందుకు ఇవ్వరు? ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ భారతరత్న అందుకున్నారని, మన తెలుగునాట నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వలేదని, ఆయనకు కూడా ఆ అవార్డు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
ఘంటసాల వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నమే మా సినిమా
ఘంటసాల గానం గురించి ప్రజలు అందరికీ తెలుసు అని, కానీ ఆయన వ్యక్తిత్వం కొంతమందికి మాత్రమే తెలుసని చిత్ర దర్శకులు సిహెచ్ రామారావు అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పడానికి వినయంతో విద్య ప్రకాశిస్తుందని ఉదాహరణ ఇవ్వడానికి నిలువెత్తు నిదర్శనం ఘంటసాల జీవితం అని తెలిపిన ఆయన తమ సినిమాలో ఘంటసాల వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఆవిష్కరించామని వివరించారు. భారత సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ గాయకుడు మీద పూర్తిస్థాయి నిడివి ఉన్న సినిమా రాలేదని, ఆ అవకాశం తనకు 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ ద్వారా కలిగినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సిహెచ్ రామారావు ముగించారు.
Also Read: 'దసరా' దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి - మెగా మాస్ మూవీ లోడింగ్?