గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రాజకీయాలకు ఎప్పుడూ దూరమే. జనసేన పార్టీ అధినేత, తన బాబాయ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు మద్దతుగా నిలిచారు. ఎన్నికల సమయంలో పిఠాపురం వెళ్లి అండగా నిలిచారు. అయితే, రాజకీయాల్లోకి రామ్ చరణ్ రాలేదు. ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన పేరు, ఆయన ఫోటో ఒక్కసారిగా రాజకీయ శ్రేణుల్లో సైతం చర్చకు దారి తీశాయి. అందుకు కారణం 'గేమ్ ఛేంజర్' సినిమా.
జనసేన కార్యకర్తలా కండువా కట్టిన రామ్ చరణ్!
వినాయక చవితి సందర్భంగా 'గేమ్ ఛేంజర్' సినిమా యూనిట్ రామ్ చరణ్ కొత్త స్టిల్ విడుదల చేశారు. సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు. అయితే, ఆ స్టిల్‌లో నుదుట ఎర్ర కండువా కట్టి రామ్ చరణ్ కనిపించారు. బాబాయ్ పవన్, ఆయన పార్టీ జనసేన కార్యకర్త తరహాలో, ఓ జన సైనికుడిలా చరణ్ కనిపించారని స్టిల్ విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. మెగా అభిమానులతో పాటు జన సైనికులకు ఈ స్టిల్ అమితంగా నచ్చింది.
సాధారణంగా సినిమాల్లో ఎవరైనా గాజు గ్లాసులో టీ తాగితే... పవన్ కల్యాణ్, జనసేన ప్రస్తావన వస్తోంది. ఎర్ర కండువాను సైతం చాలా మంది జనసేన ఖాతాలో వేస్తూ మాట్లాడుతున్నారు. అటువంటి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎర్ర కండువా కడితే మామూలుగా ఉంటుందా? అదీ సంగతి!
Also Read: తమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
సెప్టెంబర్ నెలలో రెండో పాట వస్తోందోచ్
'గేమ్ ఛేంజర్' రెండో పాట కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆ అప్డేట్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో దర్శక నిర్మాతలను నానా మాటలు అన్నారు. బూతులు తిట్టారు. ఓ బూతు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఆ రేంజ్ విమర్శలు వద్దని సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరుకున్న అప్డేట్ వచ్చింది. ఈ నెలలో 'గేమ్ ఛేంజర్' రెండో సాంగ్ విడుదల చేస్తామని చెప్పారు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో 'గేమ్ ఛేంజర్' విడుదల
Game Changer Movie Release Date: 'గేమ్ ఛేంజర్' విడుదల తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, విడుదల ఎప్పుడో చెప్పారు నిర్మాత 'దిల్' రాజు. క్రిస్మస్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం.
రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ, అంజలి నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఆయన నటనకు పేపర్లు పడతాయని 'దిల్' రాజు చెప్పారు. శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల కానుంది.