వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న రోల్స్ లో అలరించిన టాలెంటెడ్ యాక్టర్.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన తెచ్చుకోడానికి కష్ట పడుతున్నాడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సబ్జక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో 'SD కంపెనీ' అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా మారుతున్నాడు. ఇందులో ప్రొడక్షన్ నెం.1 గా ''ఫుల్ బాటిల్'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 


'ఫుల్ బాటిల్' సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 78.1 % వినోదం.. 21.9% యాక్షన్ ఉంటుందని టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ, సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంది. అయితే ఇన్ని రోజులు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడి దాకా వచ్చిందని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో, మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. 


ముందుగా ప్రిపరేషన్ వీడియో అంటూ దర్శక హీరోలు ఓ ఫన్నీ వీడియోతో వచ్చారు. సత్యదేవ్ పోషించిన మెర్క్యూరీ సూరి పాత్ర గురించి వివరించారు. ఈ క్రమంలో తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ టీజర్ ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. మెర్క్యురీ సూరి చాలా వైల్డ్‌ గా, మాస్ గా కనిపిస్తున్నాడు అని ట్వీట్ చేసాడు. 



టీజర్ లోకి వెళ్తే, కాకినాడలో నివసించే సూరి అనే తాగుబోతు ఆటో డ్రైవర్ గా సత్యదేవ్ కనిపించాడు. మద్యానికి బానిసైన అతను, రెండు పెగ్గుల మందు తాగితే చాలు అన్నీ ప్రాబ్లమ్స్ పోతాయనే అభిప్రాయంలో ఉన్నాడు. ఇందులో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. ఆమె ఏదో సమస్యలో ఉండి, సూరి సహాయం కోసం తిరుగుతోంది. అలాంటి టైంలో అతను ఏదో క్రైమ్ లో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. 


ఈ సినిమాలో సునీల్ ఒక పోలీసాఫీసర్ గా కనిపించగా.. సాయి కుమార్, బ్రహ్మాజీ, రాశీ, వైవా హర్ష, శ్వేతా నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. టీజర్ లో 'బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ.. బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తాం' అంటూ నందమూరి బాలకృష్ణ శైలిలో సత్యదేవ్ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. అలానే 'రాత్రి ఫుల్ బాటిల్ వేశావా?' అని అడిగితే నైంటీ తక్కువ అయిందని చెప్పడం అలరిస్తుంది. 


Also Read : ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!


మొత్తం మీద 'ఫుల్ బాటిల్' అనేది ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్ సాయి సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్దార్థ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. దీనికి సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఎస్‌డీ కంపెనీ, శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై రామాంజనేయులు జవ్వాజితో కలిసి సత్యదేవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో సత్యదేవ్, డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన 'తిమ్మరుసు' సినిమా పర్వాలేదనిపించుకుంది. మరి ఇప్పుడు వీరి కలయికలో రాబోతున్న 'ఫుల్ బాటిల్' చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Read Also: అన్నదమ్ముల్లా కలిసున్న ఎన్టీఆర్, కృష్ణల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయ్?