Tollywood Friendship Day Special: ఎలాంటి రక్త సంబంధం లేకున్నా మన జీవితంలో కష్ట నష్టాలను, బాధలను, సంతోషాన్ని పంచుకునేవాళ్లు ఫ్రెండ్స్. స్నేహ బంధానికి కుల మత వర్గ లింగ భేదాలు లేవు. స్నేహానికన్నా మిన్న లోకాన లేదంటారు. అందుకే అందరూ స్నేహాన్ని గుర్తు చేసుకోడానికి ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం 'ఫ్రెండ్ షిప్ డే' సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరోల ఫ్రెండ్ షిప్ గురించి తెలుసుకుందాం.


చిరంజీవి - నాగార్జున:
టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున గురించి చెప్పుకోవాలి. ఎన్నో దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న వీరిద్దరూ.. కలిసి సినిమాలు చేయలేదు గానీ, కలిసి అన్ని విషయాలు పంచుకుంటారు. కలిసి బిజినెస్ చేయడమే కాదు, ఒకరికొకరు తోడుగా నిలుస్తూంటారు. చిరంజీవి నాకు బ్రదర్ లాంటి వాడని నాగ్ అనేక సందర్భాల్లో స్వయంగా చెప్పాడు. నాగ్ తో ఉన్న అనుబంధానికి పేరు పెట్టలేమని, అతని సలహా మేరకే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశానని చిరు చాలాసార్లు చెప్పారు. వీళ్ళ మాదిరిగానే వీరి కొడుకుల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. రెండు కుటుంబాలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాయి.


రజినీకాంత్ - మోహన్ బాబు:
సీనియర్ హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ - డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు మధ్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. కొన్ని సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ, రియల్ లైఫ్ లోనూ మంచి ఫ్రెండ్ షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నో సందర్భాలలో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఇటీవల స్నేహమేరా జీవితం అంటూ ఇద్దరు కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మోహన్ బాబు.


మహేష్ బాబు - రామ్ చరణ్ - ఎన్టీఆర్:
ఈ జనరేషన్ స్టార్ హీరోలలో మహేష్ బాబు - రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల ఫ్రెండ్ షిప్ అందరినీ ఆకర్షిస్తుంది. వయసులో ముగ్గురికీ చాలా గ్యాప్ ఉన్నప్పటికీ, మంచి స్నేహం కుదిరింది. తరచుగా తమ ఫ్యామిలీలతో కలిసి పార్టీలు చేసుకోవడమే కాదు, షూటింగ్స్ లో ఉంటే లొకేషన్స్ కి వెళ్లి మరీ ముచ్చటిస్తుంటారు. ఒకరిపై ఒకరు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. వీళ్ళ ముగ్గురి సతీమణులు సైతం ఫ్రెండ్స్ గా మారారు.


రామ్ చరణ్ - ఎన్టీఆర్:
రెండు పెద్ద సినీ ఫ్యామిలీలకు చెందిన హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీలో నటించడం ఈరోజుల్లో సాధ్యమయ్యే విషయంలా కనిపించదు. కానీ రామ్ చరణ్ - తారక్ ల మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా RRR లాంటి భారీ మల్టీస్టారర్ సాధ్యమైంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు సోదర భావంతో మెలుగుతుంటారు. వీరికి మహేష్ బాబు కూడా కలిస్తే అక్కడంతా సందడే సందడి. మహేష్ ను అన్నయ్య అని తారక్ పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. 


ఎన్టీఆర్ - అల్లు అర్జున్:
ఇండస్ట్రీలో బన్నీ - తారక్ చాలా క్లోజ్ గా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఒకరినొకరు 'బావా' అని ప్రేమగా పిలుచుకుంటారు. సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ, సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు తమ మధ్య స్నేహ బంధాన్ని చాటి చెప్తుంటారు.


ప్రభాస్ - గోపీచంద్:
సినిమాలో హీరో విలన్లుగా నటించిన ప్రభాస్ - గోపీచంద్.. రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. ఒకరికొకరు సపోర్ట్ గా నిలుస్తుంటారు. గోపీచంద్ ను హీరోగా నిలబెట్టడానికి ప్రభాస్ తనవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఆ మధ్య 'అన్ స్టాపబుల్' షోకి కలిసి హాజరై, ఎన్నో విషయాలను పంచుకున్నారు 


రానా దగ్గుబాటి - రామ్ చరణ్:
రానా - చరణ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి ప్లేట్ లో మరొకరు తినే అంత గట్టి స్నేహ బంధం వారి మధ్య ఉంది. చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్నప్పుడు మొదలైన ఈ ఫ్రెండ్ షిప్.. ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది.


అఖిల్ - చరణ్: 
చిరంజీవి - నాగార్జున మాదిరిగానే వీరి కుమారులు రామ్ చరణ్ - అఖిల్ కూడా స్నేహంగా మెలుగుతుంటారు. ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. అఖిల్ రెగ్యులర్ గా చెర్రీ ఇంటికి వెళ్లి మరీ కలుస్తుంటారు. అన్ని విషయాల్లోనూ అఖిల్ ను చరణ్ ఎంకరేజ్ చేస్తుంటారు.


నితిన్ - అఖిల్:
అక్కినేని అఖిల్ కి నితిన్ మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలోకి అఖిల్ రాకముందు నుంచే వీరి మధ్య స్నేహం ఉంది. నితిన్ తన సొంత బ్యానర్ లో అఖిల్ ను హీరోగా పరిచయం చేశారు. అయితే వీళ్లిద్దరూ పెద్దగా బయట కలిసి కనిపించరు. 


టాలీవుడ్ లో వీరితో పాటుగా అనేకమంది హీరోల మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది. మహేష్ బాబు - సుమంత్, రామ్ చరణ్ - శర్వానంద్, రానా - అల్లు అర్జున్, ప్రభాస్ - రానా, అల్లరి నరేశ్ - నాని, ఎన్టీఆర్ - మంచు మనోజ్, మంచు మనోజ్ - సాయి ధరమ్ తేజ్, విజ‌య్ దేవ‌ర‌కొండ - న‌వీన్ పోలిశెట్టి, నాగ‌శౌర్య - బెల్లంకొండ శ్రీనివాస్, వరుణ్ తేజ్ - నితిన్ వంటి పలువురు హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిలో చాలా మందికి ఏరా, బాబాయ్ అని పిలుచుకునేంత చనువు ఉంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడినా, రియల్ లైఫ్ లో మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరి బ్రోమాన్స్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం.