Former Miss India Tripura Rinky Chakma: 2017లో మిస్ ఇండియా త్రిపుర కిరీటాన్ని దక్కించుకుంది రింకీ చక్మా. తాజాగా తను క్యాన్సర్ కారణంగా మృతి చెందింది అనే వార్త వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్లకే క్యాన్సర్‌తో మరణించడంతో రింకీ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు నెటిజన్లు. గత రెండేళ్లుగా తను క్యాన్సర్‌తో పోరాడుతుందని తాజాగా కన్నుమూసిందని సమాచారం. 2022 నుంచి తను క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన మృతికి ఫెమీనా సంతాపం ప్రకటించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో తను చనిపోయినట్టు బయటపెట్టింది. కేవలం మిస్ ఇండియా మాత్రమే కాదు.. మరెన్నో బ్యూటీ పోటీలలో కూడా రింకీ పాల్గొంది.
మిస్ ఇండియా ప్రకటన..
రింకీ చక్మా మరణించిన విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రకటించింది. ‘‘ఎంతో బాధతో మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా మరణించిన విషయాన్ని మేం ప్రకటిస్తున్నాం. 2017లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో తను త్రిపుర తరపున పాల్గొంది. అందులో బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ఇది తన ప్యాషన్‌కు, ప్రయత్నాలకు మొదటి మెట్టుగా మారింది. ఈ కష్ట సమయంలో తన కుటుంబానికి, స్నేహితులకు ధైర్యం చేకూరాలని కోరుతున్నాం. తన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాం. నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావు రింకీ. నీ గురించి తెలిసిన వారందరూ నిన్ను మిస్ అవుతారు’’ అంటూ ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ షేర్ చేసుకుంది.
బ్రెస్ట్ క్యాన్సర్..
రింకీ చక్మాకు ఫైల్లోడ్స్ ట్యూమర్ అనే వ్యాధి వచ్చింది. ఎన్నో రకాల బ్రెస్ట్ క్యాన్సర్‌లలో ఇది కూడా ఒకటి. దానికోసం తనకు సర్జరీ కూడా జరిగింది. కానీ ఆ సర్జరీ వల్ల తను పూర్తిగా కోలుకోలేదు. ఆ క్యాన్సర్ తన లంగ్స్ వరకు చేరుకుంది. మెల్లగా అది తన మెదడుపై కూడా ప్రభావం చూపింది. దాని వల్ల రింకీకి బ్రెయిన్ ట్యూమర్ కూడా వచ్చింది. మెల్లగా తన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది. కొన్నాళ్లకు కీమోథెరపీకి కూడా రింకీ స్పందించడం మానేసింది. అలా క్యాన్సర్‌తో పోరాడుతూనే తను కన్నుమూసింది. ఫిబ్రవరీ 22న రింకీ చక్మా ఆరోగ్యం మరింత క్షీణించడంతో తనను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై పెట్టారు. అయినా కూడా తన లంగ్స్ పూర్తిగా దెబ్బతినడంతో రింకీ మరణించినట్టుగా డాక్టర్లు తెలిపారు.
ఆర్థిక సాయం..
గత నెలలోనే తన క్యాన్సర్ ట్రీట్మెంట్‌కు డబ్బులు కావాలంటూ ఆర్థిక సాయం కోరుతూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది రింకీ చక్మా. గత రెండేళ్లుగా తనతో పాటు తన కుటుంబం కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. తరచుగా ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని, దానికోసం తనకు కాస్త ఆర్థిక సాయం కావాలని కోరింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు మోడల్ ప్రియాంక కుమారీ కూడా రింకీకి అండగా నిలబడినట్టు తెలుస్తోంది.
Also Read: మనశ్శాంతి లేదు.. ఎటైనా వెళ్లిపోవాలని ఉంది - 'ధృవ నక్షత్రం' వాయిదాపై గౌతమ్ మేనన్ ఆవేదన!