Joya in Animal: ఒక యాక్టర్‌ చేసిన పాత్రకు క్రేజ్ దక్కాలంటే అది లీడ్ రోల్ అవ్వాల్సిన అవసరమే లేదు. చూసే ప్రేక్షకులపై వారి యాక్టింగ్ ప్రభావం ఎంత ఉంటుంది అనేదానిపై వారికి దక్కే క్రేజ్ ఆధారపడుతుంది. ‘యానిమల్’ సినిమాలో తృప్తి దిమ్రీనే దీనికి ఉదాహరణ. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’లో తృప్తి మెయిన్ హీరోయిన్ కాదు. అందులో తను సెకండ్ హీరోయిన్ పాత్రలోనే కనిపించింది. కానీ మెయిన్ హీరోయిన్‌గా నటించిన రష్మిక కంటే తృప్తి గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక మూవీ విడుదలయిన ఇన్నాళ్లకు అసలు ఈ సినిమా కోసం తను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే విషయం బయటికొచ్చింది.


రెమ్యునరేషన్ ఎంతంటే..?
‘యానిమల్’ సినిమా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు తృప్తిని ‘భాబీ 2’ అని పిలవడం మొదలుపెట్టారు. సినిమాలో తను పోషించిన జోయా అనే పాత్రకంటే భాబీ 2గానే ఫేమస్ అయ్యింది. తను ఇప్పటివరకు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా కూడా ‘యానిమల్’ వల్ల తనకు వచ్చినంత గుర్తింపు మునుపటి సినిమాల వల్ల రాలేదు. అందుకే ఈ మూవీలో నటించడం కోసం తృప్తి రెమ్యునరేషన్ చాలా తక్కువ అని సమాచారం. ‘యానిమల్’లో జోయా పాత్ర కోసం తృప్తి కేవలం రూ.40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌గా అందుకుందట.


సీనియర్ సెలబ్రిటీలను వెనక్కి తోసి..
రెమ్యునరేషన్ తక్కువే అయినా ‘యానిమల్’ సినిమా తృప్తి కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యింది. బాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. టాలీవుడ్ నుంచి కూడా తనకు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటివరకు తనెవరో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. ఇప్పుడు ఏకంగా ఐఎమ్‌డీబీ పాపులర్ సెలబ్రిటీల లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్ల వారసులు అయిన సుహానా ఖాన్, ఖుషీ కపూర్‌ను కూడా తను వెనక్కి నెట్టేసింది. అంతే కాకుండా మరెందరో సీనియర్ సెలబ్రిటీలు కూడా ఈ లిస్ట్‌లో తృప్తి తరువాత స్థానాల్లోనే ఉన్నారు. దీంతో ఒక్క సినిమా, ఒక్క పాత్ర.. తృప్తి కెరీర్‌ను ఎంతగా మార్చేసింది అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.


320 శాతం పెరిగిన ఇన్‌స్టా ఫాలోయింగ్..
సోషల్ మీడియాలో కూడా తృప్తికి ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ‘యానిమల్’ విడుదలకు కూడా తృప్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 6 లక్షల ఫాలోవర్స్ మాత్రమే ఉండేవారు. ఇక ఆ మూవీ విడుదలయ్యి తన గురించి ప్రేక్షకులందరికీ తెలిసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఏకంగా 320 శాతం పెరిగింది. ప్రస్తుతం తృప్తి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 2.7 మిలియన్‌కు చేరుకుంది. ఆలియా భట్‌లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా తృప్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. డిసెంబర్ 1న విడుదలయిన ‘యానిమల్’ ప్రస్తుతం బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. కేవలం ఇండియన్ బాక్సాఫీస్‌లోనే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. ఇప్పటికీ ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇందులో తృప్తి నటనకు ఫిదా అయిన చాలామంది తెలుగు మేకర్స్.. తనతో టాలీవుడ్‌లో డెబ్యూ చేయించడానికి క్యూ కడుతున్నారు. తాజాగా ఎన్‌టీఆర్ సరసన నటించాలని ఉందంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది తృప్తి.


Also Read: త్రిప్తి దిమ్రి దెబ్బకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఔట్ - అరుదైన క్రెడిట్ కొట్టేసిన ‘యానిమల్‘ బ్యూటీ