Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండపై శృతిమించిన అసభ్యకర వార్తలను ప్రచారం చేసినందుకు పోలీసులు ఓ యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


యూట్యూబ్ ఛానెల్‌లో అసత్యపు వార్తలు..
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో రౌడీ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతకంటే ఎక్కువమంది తనను విమర్శిస్తారు కూడా. అయినా విజయ్ మాత్రం ఎక్కువశాతం అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాడు. కానీ తాజాగా సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో విజయ్ గురించి కొన్ని అసభ్యకర వార్తలు ప్రసారమయ్యాయి. ఆ ఛానెల్‌కు చెందిన వ్యక్తి.. ఈ హీరో గురించి కొన్ని అసత్యపు వార్తలను ప్రసారం చేశాడు. దీంతో ఈ విషయం పోలిసుల వరకు వెళ్లింది. వీడియోలో విజయ్ దేవరకొండ గురించి అసభ్యకరంగా మాట్లాడడంతో పోలీసులు రంగంలోకి దిగారు.


కఠినమైన చర్యలు తప్పవు..
సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. విజయ్ దేవరకొండపై ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమయిన ఒక వీడియోలో కేవలం ఆ హీరో గురించి మాత్రమే కాదు.. తనతో పాటు సినిమాల్లో నటించిన హీరోయిన్స్ గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడాడు వెంకట కిరణ్. దీంతో పోలిసులు అతడిపై చర్యలు తీసుకున్నారు.


ఒక నటుడి గౌరవాన్ని కించపరిచేలా అతడి వీడియో ఉందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొన్ని గంటల్లోనే వెంకట కిరణ్‌ను అరెస్ట్ చేశారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వీడియోలను డిలీట్ చేయించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది మాత్రమే కాదు ప్రముఖ వ్యక్తులపై టార్గెటెడ్‌గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


‘ఫ్యామిలీ స్టార్’తో బిజీ..
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దాంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఓవైపు ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్ జరుగుతుండగా మరోవైపు ఆ తరువాతి ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే విజయ్ సినిమాను వెండితెరపై చూసి చాలాకాలం అవుతుండగా.. తమ రౌడీ హీరోను మళ్లీ థియేటర్లలో ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తనకు ‘గీతా గోవిందం’లాంటి హిట్‌ను అందించిన పరశురామ్‌తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ చేస్తున్నాడు విజయ్. ఇందులో తనకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.


Also Read: ఇష్టం లేకపోతే చూడకండి, ‘యానిమల్’ విమర్శలపై త్రిప్తి దిమ్రి ఘాటు వ్యాఖ్యలు!