పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు అనే సామెత మనం ఎప్పటి నుంచో వింటున్నాం. పులిని చూసి వాతలు పెట్టుకుంటే, పులి అవ్వడం పక్కన పెడితే.. ఒళ్లు కాలి బాధపడాల్సి వస్తుంది. ఇది సినిమా ఇండస్ట్రీలో  అనేక సందర్భాల్లో నిజమైంది. ఏదైనా సినిమా హిట్ ఐతే, అందరూ అదే జోనర్ లో చిత్రాలు చేయడం.. అవి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్స్ గా మారడం మనం చూశాం. అలాంటి సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం!

 

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన సినిమా 'బాహుబలి'. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ ఎపిక్ యాక్షన్ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ అయింది. రెండూ ఇండియన్ బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచి, సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పటికీ అత్యధిక వసూళ్ళు రాబట్టిన ఇండియన్ సినిమాల లిస్ట్ లో 'బాహుబలి: ది కన్ క్లూజన్' టాప్ లో ఉంది. అయితే 2015లో 'బాహుబలి: ది బిగినింగ్' సక్సెస్ అయిన తర్వాత మిగతా భాషల్లోనూ, భారీతనంతో విజువల్ గ్రాండియర్ సినిమాలు చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. అలాంటి వాటిల్లో 'పులి' కూడా ఒకటి. 

‘బాహుబలి’ బాటలో ‘పులి’


కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'పులి'. శృతి హాసన్, హన్సిక మోత్వానీలు హీరోయిన్స్ గా నటించారు. ‘బాహుబలి’లో రమ్యకృష్ణ, రానా ఉన్నట్లే, ఇక్కడ దివంగత అతిలోకసుందరి శ్రీదేవి, కిచ్చా సుదీప్ ఉన్నారు. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. కోట్లు కుమ్మరించిన నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.

‘మగధీర’ను చూసి ‘శక్తి’.. ‘బద్రినాథ్’లు వచ్చారు


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ బిగ్ హిట్ 'మగధీర'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికి తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ నమోదు చేసింది. దీంతో ఫిలిం మేకర్స్ అంతా అదే బాటలో పయనించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'శక్తి' సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశారు. కానీ ఇది డిజాస్టర్ గా నిలిచి, నిర్మాత అశ్వినీదత్ ను నష్టాల్లోకి నెట్టేసింది. అలానే వీవీ వినాయక్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'బద్రీనాథ్' అనే యాక్షన్ మూవీ చేసాడు. ఇది గీతా ఆర్ట్స్ వారికి నష్టాలనే మిగిల్చింది.

‘అరుంధతి’ స్ఫూర్తితో ‘పంచాక్షరి’


అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'అరుంధతి' సినిమా మంచి విజయాన్ని సాధించింది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి రూ.13 కోట్లు ఖర్చు చేస్తే, రూ.70 కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో అందరూ హారర్ ఫ్యాంటసీ జోనర్ బాట పట్టారు. అనుష్కతోనే 'పంచాక్షరి' అనే సినిమా చేశారు. సముద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్లాప్ అయింది.

KGFలా ‘కబ్జా’ చేయాలనుకుని...


ఇక కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా 'KGF'. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కింది. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ 2 చిత్రమైతే గతేడాది ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అయితే KGF తరహాలోనే ఇటీవల 'కబ్జ' అనే సినిమా వచ్చింది. ఉపేంద్ర, సుదీప్ వంటి స్టార్ కాస్ట్ తో ఆర్ చంద్రు రూపొందించిన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రతీ విషయంలోనూ కేజీఎఫ్ ను పోలి ఉండటంతో.. చూసిన సినిమానే మళ్లీ చూడాలా అని ఆడియన్స్ ‘కబ్జా’ను రిజెక్ట్ చేశారు.

‘పుష్ప’ స్టైల్‌లో ‘దసరా’ - రిజల్ట్, వెయిటింగ్!


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' తరహాలోనే ఇప్పుడు 'దసరా' సినిమా రాబోతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తీశాడు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అదే సమయంలో ‘పుష్ప’తో కంపేరిజన్స్ వచ్చాయి. అక్కడ పుష్పరాజ్, ఇక్కడ ధరణి వేషాలు ఒకేలా ఉన్నాయన్నారు. అక్కడ మారేడుమిల్లి అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకుంటే, ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యాన్ని తీసుకున్నారు. ఇలా చాలా విషయాల్లో పోలికలు పెడుతున్నారు. మరి 'దసరా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.