టికెట్ రేట్స్ పెంచిన తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు సరిగా రావడం లేదని కొంత మంది చలన చిత్ర ప్రముఖుల్లో ఒక అభిప్రాయం ఉంది. తమ సినిమాకు టికెట్ రేట్స్ తగ్గిస్తున్నామంటూ చాలా మంది చెబుతున్నారు. అయితే... గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితి వేరేలా ఉందని ఎంఎస్ రాజు మాటలను బట్టి అర్థం అవుతోంది.


ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్' శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా యువతకు విపరీతంగా నచ్చిందని, కుటుంబ ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. '7 డేస్ 6 నైట్స్' సక్సెస్ మీట్‌లో టికెట్ రేట్స్ గురించి ఎంఎస్ రాజు మాట్లాడారు.


''నేను ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాను. అక్కడ టికెట్ రేట్ రెండు వందల రూపాయలు ఉంది. చిన్న సినిమాకు ప్రేక్షకులు 200 ఎందుకు పెడతారు?'' అని ఎంఎస్ రాజు ప్రశ్నించారు. తాను చిన్న సినిమా తీశాను కాబట్టి ఇలా ప్రశ్నించడం లేదని, తన సినిమా కోసం అయితే విడుదలకు ముందు అడిగే వాడినని ఆయన అన్నారు. 


''మా సినిమాకు మంచి టాక్, కలెక్షన్స్ వస్తున్నా... చిన్న వెలితి. ఇవాళ సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. ఈ విషయంలో ఎవరూ బయటపడరు. ఎందుకంటే... పాన్ ఇండియా హీరోలతో పెద్ద నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు దాసరి నారాయణరావు, కె బాలచందర్ తరహాలో చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే? ఇప్పుడు 'హ్యాపీ డేస్' లాంటి సినిమాలు వస్తే? ఆలోచించాల్సిన పరిస్థితి. గతంలో నేనూ పెద్ద చిత్రాలు తీశాను. లో బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు టికెట్ రేటు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది'' అని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. 


Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?


ఇంకా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ''ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలుగు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతా హ్యాపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే... పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు తగ్గించండి. ప్రయోగాత్మక చిత్రాలు టికెట్ రేటు ఎంత తగ్గిస్తారు? 30 శాతమా? 40 శాతమా? లేదంటే థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలే విడుదల చేయాలా? చిన్న చిత్రాల కోసం ఏం చేస్తున్నారు? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వంతో పరిశ్రమ పెద్దలు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద సినిమాలకు ఎంత రేట్ అయినా పెట్టుకోండి. ఇద్దరు ముగ్గురు హీరోలతో సినిమాలు తీసుకోండి. క్రేజ్ ఉంది కాబట్టి థియేటర్లకు జనాలు వస్తారు. చిన్న సినిమాకు ఏదైనా చేయండి. లేదంటే చిన్న సినిమా రాదు'' అని చెప్పారు. 


Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?