Baahubali Re Release In October 2025: బాహుబలి (Baahubali).. ఈ పేరు వింటేనే తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ గూస్ బంప్స్. ఇండియన్ మూవీ హిస్టరీలోనే తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం టాలీవుడ్ వైపు చూసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. 'బాహుబలి' రీ రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

రీ రిలీజ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన 'బాహుబలి'ని మళ్లీ థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరులో రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. 2015లో విడుదలైన ఈ మూవీ విడుదలై అక్టోబర్ నాటికి సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. 'ఈ ఏడాది అక్టోబరులో 'బాహుబలి' మూవీని ఇండియా, ఇంటర్నేషనల్ వైడ్ రీ రిలీజ్ చేస్తున్నాం. ఇది మా ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్ ఇయర్ అవుతుంది.' అంటూ శోభు తెలిపారు. 

Also Read: పూరి, విజయ్ సేతుపతి సినిమాలో 'వీరసింహారెడ్డి' విలన్ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. టైటిల్ అదేనా?

రికార్డులు ఖాయమేనా..

బాహుబలి సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండో పార్ట్ కన్నా ఫస్ట్ పార్ట్‌కే ఎక్కువ క్రేజ్. 'వై కట్టప్ప కిల్స్ బాహుబలి' అనే సస్పెన్స్‌ను ఏడాది పొడవునా రాజమౌళి క్రియేట్ చేశారు. 2015లో విడుదలైన ఈ ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, రానాతో పాటు అందాల నటి అనుష్క, మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని మూవీని నిర్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ అందించారు.

రీ రిలీజ్‌లోనూ ఈ మూవీ రికార్డులు సృష్టించడం ఖాయమంటూ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్‌లో రీ రిలీజ్‌కు ఇప్పటి నుంచి ప్రకటన చేశారంటే రీ రిలీజ్ సైతం ఓ రేంజ్‌లో ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. మరి గత రీ రిలీజ్ మూవీస్ రికార్డులను అధిగమిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మాహిష్మతి రాజ్య పీఠం కోసం తమ్ముడిపై అన్న కుట్రలు.. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడి కొడుకు తన పెదనాన్నతో యుద్ధం చేసి తిరిగి సింహాసనాన్ని ఎలా కైవసం చేసుకున్నాడో విజువల్ వండర్‌గా రెండు పార్ట్స్‌లో చూపించారు దర్శకధీరుడు.