Navina Bole Allegations On Sajid Khan: బాలీవుడ్ సీరియల్ హీరోయిన్ నవీనా బోలే (Navina Bole) దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రాజెక్ట్ కోసం వెళ్తే డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బంది పడినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అది ఎప్పటికీ మర్చిపోను

ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్ ఖాన్ (Sajid Khan) పిలిస్తే అతని ఆఫీసుకు వెళ్లానని.. ఆయన ప్రవర్తన ఎంతో అమర్యాదకరంగా ఉండడంతో జీవితంలో అతన్ని కలవకూడదని ఫిక్స్ అయ్యానంటూ హీరోయిన్ నవీనా బోలె తెలిపారు. '2004 - 06 మధ్య కాలంలో ఓ ప్రాజెక్ట్ పని మీద దర్శకుడు సాజిద్ ఖాన్ నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆయన్ను కలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఆయనకు మహిళలను గౌరవించడం తెలియదు. ప్రాజెక్ట్ చర్చల కోసం ఆఫీస్‌కు వెళ్తే దుస్తులు తొలగించి కూర్చోమంటూ అసభ్యంగా మాట్లాడారు.

డ్రెస్ లేకున్నా సౌకర్యంగా కూర్చోగలవా? లేదా? అని టెస్ట్ చేస్తున్నానంటూ చెప్పారు. అది విని నేను షాక్ అయ్యాను. నువ్వు బికినీ వేసుకుంటావుగా?, అలాంటప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు.. నువ్వు నీలా ఉండు అంతే అని అన్నారు.' అని నవీనా బోలే ఆరోపించారు.

Also Read: రెండున్నరేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ 'ముత్తయ్య' - రాజమౌళి రిలీజ్ చేసిన ట్రైలర్ చూశారా?.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

అలా బయటపడ్డాను

సాజిద్ ఖాన్ అలా మాట్లాడేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదని నవీనా బోలే తెలిపారు. ఆ రోజు తనతో పాటు తన స్నేహితులు వచ్చారని.. వాళ్లు నా కోసం ఎదురుచూస్తున్నారని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. 'ఆ తర్వాత నాకు వరుస ఫోన్ కాల్స్ చేశారు. మెసేజెస్ పంపించారు. ఇంటికి చేరుకున్నావా?, ఆఫీస్‌కు తిరిగి వస్తానన్నావు, ఇంకా రావడం లేదేంటి?' అంటూ దాదాపు 50 సార్లు ఫోన్ చేసినట్లు చెప్పారు. కానీ తాను దేనీకి రెస్పాండ్ కాలేదని.. ఈ ఘటన తర్వాత ఆయన్ను మళ్లీ కలవకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

అయితే, 2018లో 'మీటూ' ఉద్యమ సమయంలోనూ సాజిద్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన 'హే బేబీ', 'హౌస్ ఫుల్ 2', 'హిమ్మత్ వాలా' వంటి చిత్రాలను రూపొందించారు. అలాగే, పలు టీవీ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించారు.

ఇక నవీనా బోలే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి పలు టీవీ సీరియళ్లల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. మిలే జబ్ హమ్ తుమ్, జెన్నీ ఔర్ జుజు, సప్నా బబుల్ కా, బిడాయి, ఇష్క్ బాజ్ వంటి హిందీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.