Family Man 3 Series Actor Rohit Basfore Suspicious Death: బాలీవుడ్ నటుడు రోహిత్ బాస్ఫోర్ (Rohit Basfore) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హిట్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కుతోన్న 'ఫ్యామిలీ మ్యాన్ 3'లో (Family Man 3) ఆయన నటించారు. ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఓ వాటర్ ఫాల్ వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
హత్య చేశారా?
రోహిత్ బాస్ఫోర్ ఒంటిపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ పార్కింగ్ విషయంలో రోహిత్ ముగ్గురు వ్యక్తులతో గొడవ పడ్డారని.. వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్ కొన్ని నెలల క్రితమే ముంబయి నుంచి గౌహతి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ఆ రోజు సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అస్సాంలోని ఓ జలపాతం వద్ద అతని మృతదేహాన్ని గుర్తించారు.
రోహిత్ ఒంటిపై గాయాలు ఉండడంతో అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి కావాల్సిన వారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పార్కింగ్ విషయంలో రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు తమ కుమారుడితో గొడవ పడ్డారని రోహిత్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓ ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని అంటున్నారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నటుడి శరీరంపై గాయాలున్నట్లు చెప్పారు. ముఖం, తల, ఇతర భాగాలపై గాయాలు ఉన్నాయని అన్నారు. అయితే, రోహిత్ నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది.