ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) లైంగిక ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు రావలసిన నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది అన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ విషయంపై లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ (Anee Master) స్పందించారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై కొరియోగ్రాఫర్ అని మాస్టర్ మాట్లాడారు. 


జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధాకరమని అనీ మాస్టర్ అన్నారు. అంతే కాకుండా ఆమె జానీ మాస్టర్ తో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. తాను 'రచ్చ' సినిమాకి జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశానని, రెండేళ్లకి పైగానే ఆయన దగ్గర పని చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి విషయం ప్రూవ్ అవ్వకుండా ఇలా అతన్ని బ్యాడ్ చేయడం సమంజసం కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


"ఆరు నెలల ముందు వరకు జానీ మాస్టర్ గురించి అంత చక్కగా మాట్లాడిన అమ్మాయి సడన్ గా ఇలా మాట్లాడడం అనేది నాకు పెద్ద షాక్. గ్రూప్ లో డిస్కషన్ నడిచింది. వార్తలు వచ్చాయి. అయితే నేను ఈ వివాదంలో ఇన్వాల్వ్ కాదలచుకోలేదు కాబట్టి చూసి వదిలేశాను. నిజానికి ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను. అసలు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు" అంటూ జానీ మాస్టర్ పై బాధితురాలు లైంగిక ఆరోపణలు చేయడం గురించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాగా వివాదం జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఆమె జానీ మాస్టర్ గురించి స్పందించడం కొత్త చర్చకు దారి తీసింది. కొరియోగ్రాఫర్ ఆని మాస్టర్ బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై చాలా మంది ఫైర్ అవుతుంటే, కొంత మంది ఆయన అలాంటివాడు కాదంటూ సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో అనీ మాస్టర్ కూడా చేరింది. 


Read Also : Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?


జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన యువతి ఆయనపై లైంగిక ఆరోపణలు చేస్తూ తనను బెదిరించి, పలుమార్లు అత్యాచారం చేశారంటూ పోలీసులను ఆశ్రయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించారని, పలుసార్లు అఘాయిత్యం చేశారని తన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. దీంతో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ కు రావలసిన నేషనల్ అవార్డు రాకుండా ఆగిపోయింది. 2022 ఏడాదికి గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అప్పటికే జానీ మాస్టర్ కు అవార్డును ప్రకటించడం జరిగింది. కానీ అంతలోపే ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అవార్డును రాకుండా నిలిపేశారు. నిజానికి కోర్టు జానీ మాస్టర్ కు ఈ అవార్డుకు తీసుకోవడానికి మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ జానీ మాస్టర్ కు ఈ అవార్డును నిలిపివేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక అప్పటినుంచి జానీ మాస్టర్ చంచల్ గూడా జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. అయితే ఈ విషయాన్ని చూసిన జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ కలత చెందడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.