Family Star Controversy: ఈరోజుల్లో థియేటర్లలో విడుదలయిన సినిమా.. ఓటీటీలోకి రాగానే నెటిజన్లలో దాని గురించి చర్చ మొదలయిపోతుంది. కొన్ని చిత్రాలపై ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్ అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఓటీటీలో విడుదలయ్యింది. ఓటీటీలోకి వచ్చేసిన రోజే ఈ మూవీని చూసిన చాలామంది ప్రేక్షకులు.. ఇందులోని ఒక సీన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయ్ దేవరకొండపై, దర్శకుడు పరశురామ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. థియేటర్లలో ఈ సీన్‌ను పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు.. ఓటీటీలోకి రాగానే దీని గురించి తెగ ట్వీట్లు చేస్తున్నారు.


విలన్‌కు వార్నింగ్..


‘ఫ్యామిలీ స్టార్’లో గోవర్ధన్ అనే పాత్రలో కనిపించాడు హీరో విజయ్ దేవరకొండ. సినిమాలోని ఒక సీన్‌లో తన అన్న తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేయాలి అంటూ వదినకు వార్నింగ్ ఇస్తాడు రవి బాబు. అంతే కాకుండా పలు అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేస్తాడు. అది నచ్చని గోవర్ధన్.. విలన్ ఉండే చోటికి వెళ్లి.. తన మనుషులను చితగ్గొట్టి తనకు వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’లోని ఈ సీన్, ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండ.. విలన్‌కు ఇచ్చే వార్నింగ్ డైలాగ్.. పలు కాంట్రవర్సీలకు దారితీస్తుంది. విలన్ ఎలా అయితే తన వదినతో అసభ్యకరంగా మాట్లాడాడో.. విలన్ ఇంట్లోని ఆడవారి గురించి కూడా హీరో అలాగే మాట్లాడాడు అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.


నెటిజన్ల కామెంట్స్..


‘‘ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ చూశాను. దేవరకొండ పాత్ర మంచి అబ్బాయిలా ఉంది. కానీ విలన్ ఇంట్లో ఆడవారిని రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఒకవేళ ‘అర్జున్ రెడ్డి’లో ఇలా చేసుంటే ఆ పాత్ర అలాంటిదే అని వదిలేసే వాళ్లం. కానీ ‘ఫ్యామిలీ స్టార్‌’లో ఒక మంచి అబ్బాయి ఇలా చేశాడు’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఇలాంటి డైలాగులు పెట్టి సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని పేరు పెట్టారు’’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.










ఫ్యాన్స్ సపోర్ట్..


ఒకవైపు ‘ఫ్యామిలీ స్టార్’పై, విజయ్ దేవరకొండపై ఇంత నెగిటివిటీ వస్తుండగా.. తనను సపోర్ట్ చేయడానికి ఫ్యాన్స్ ముందుకొస్తున్నారు. సినిమాలోని ఒక డైలాగ్‌ను పట్టుకొని హీరో గురించి తప్పుగా మాట్లాడడం, తక్కువగా చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ ప్రతీ సినిమాకు ఇలాంటి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతూనే ఉంది. అయితే తనపై కావాలనే కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఫ్యాన్స్ వాపోతున్నారు.



Also Read: ఏడుస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు, ఆరోజంతా బస్ స్టాప్‌లోనే పడుకున్నా - హరీష్ శంకర్