Rocking Rakesh KCR Movie: తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ 30న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. గ్రామ గ్రామాన తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు రకరకాల యాడ్స్ తో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేసేందుకు పలు పార్టీలు మద్దతుదారులు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు నష్టం కలిగించేలా ఈ సినిమాలు రూపొందాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి.  


‘కేసీఆర్’ సినిమా విడుదలకు ఈసీ బ్రేక్


ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ రూపొందించిన ‘కేసీఆర్’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రాకేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల అయ్యింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘కేసీఆర్’ సినిమాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పోలింగ్ సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి, విడుదలను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.  


‘కేసీఆర్’ సినిమా రిలీజ్ నిలిపివేతపై రాకేష్ ఏమన్నాడంటే?


తాజాగా ఈ విషయాన్ని రాకింగ్ రాకేష్ స్వయంగా వెల్లడించారు. సినిమా విడుదలను నిలిపివేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17న లేదంటే 24న విడుదల చేయాలని భావించామని చెప్పారు. “‘కేసీఆర్’ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలి అనుకున్నాం. కానీ, మా సినిమా విడుదలను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ సినిమాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని ఈసీ చెప్పింది. ఈ మూవీ రిలీజ్ నిలిచిపోవడం వెనుక ఎవరి ప్రమేయం లేదు. ఈసీ స్వయంగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే సినిమా విడుదల ఆగిపోయింది. ఇది కూడా మంచి పరిణామమే అని భావిస్తున్నాను. సినిమాను మరింత బాగా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది” అని రాకేష్ వెల్లడించారు.   


రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్


అటు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఇందులో పలు పార్టీల నాయకులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఈ మూవీని ఏపీ సీఎం జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఆయన రెండు భాగాలుగా తెరకెక్కస్తున్నారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో చట్టపరంగా ముందుకు వెళ్తామని వర్మ వెల్లడించారు.


Read Also: స్విమ్ సూట్ ఫోటోలు పంపితే, సిస్టర్ క్యారెక్టర్ చేయమన్నారు: నటి కస్తూరి