Happy Birthday Nithiin: 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యూత్ స్టార్ నితిన్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు, మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఓవైపు క్లాస్ సినిమాలు చేస్తూనే, మరోవైపు మాస్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న యువ హీరో.. ఫ్లాప్స్ ఎదురైన ప్రతీసారి ప‌డిలేచిన కెర‌టంలా బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు. నేడు నితిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ అందజేస్తూ, ఆయన గురించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.


⦿ నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి. తెలంగాణాలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్. సుధాకర్ రెడ్డి - లక్ష్మీ దంపతులకు 1983 మార్చి 30న జన్మించారు. అతని అక్క నికితా రెడ్డి కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు.


⦿ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన నితిన్.. ఆయన నటించిన 'తొలిప్రేమ' సినిమా చూసి హీరో అవ్వాలని నిర్ణయించుకున్నారు. 2022 లో తేజ దర్శకత్వంలో 'జయం' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. డెబ్యూతోనే సూపర్ హిట్ సాధించి, ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు.


⦿ 'దిల్' సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నితిన్.. రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'సై' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఆ తర్వాత అల్లరి బుల్లోడు, ధైర్యం, రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, అడవి, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం లంకలో, మారో వంటి డజను ఫ్లాపులు రుచి చూశారు.


⦿ 2012లో 'ఇష్క్‌' వంటి క్లాసిక్ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్.. 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే', 'హార్ట్ ఎటాక్', 'అ ఆ', 'భీష్మ' వంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే మధ్యలో చిన్నదానా నీకోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్, లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కల్యాణం, చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో నిరాశ పరిచారు.


⦿ నితిన్ తన 22 ఏళ్ళ సినీ కెరీర్లో ఇప్పటి వరకూ 32 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అలానే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో 'తమ్ముడు' సినిమా చేస్తున్నారు.


⦿ నితిన్ తన కెరీర్ లో తేజ, కె.రాఘ‌వేంద్ర‌రావు, ఎస్.ఎస్ రాజ‌మౌళి, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి, చంద్రశేఖర్ యేలేటి, దశరథ్, కరుణాకరన్ లాంటి ప్రముఖ దర్శకులతో క‌లిసి వర్క్ చేశారు. టాలీవుడ్ లో వీరందరితో పని చేసిన మరో హీరో లేడనే చెప్పాలి.


⦿ 'శ్రేష్ట్ మూవీస్‌' అనే పేరుతో సొంత  ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు నితిన్. 'అఖిల్' సినిమాతో తన స్నేహితుడు అఖిల్ అక్కినేనిని తన బ్యానర్ లోనే హీరోగా లాంచ్ చేశాడు. 


⦿ కెరీర్ ప్రారంభంలో జయం, దిల్, సంబరం సినిమాలలో నితిన్ కు హీరో శివాజీ డబ్బింగ్ చెప్పారు. 'శ్రీ ఆంజనేయం' చిత్రానికి తొలిసారిగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.


⦿ నితిన్ తన సినిమాల్లో ఎక్కువగా తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ రిఫరెన్స్ లు పెట్టుకోడానికి ఇష్టపడతారు. అతను నటించిన 'చల్ మోహన్ రంగ' సినిమాకి పవన్ కళ్యాన్ నిర్మాతగా వ్యవహరించారు. దీనికి త్రివిక్రమ్ కథ అందించడంతో పాటు నిర్మాణంలో భాగం పంచుకున్నారు.


⦿ 2020లో నితిన్ తన స్నేహితురాలు షాలిని కందుకూరిని పెళ్లి చేసుకున్నారు. ఇక తన తన పేరులో అదనంగా 'i' ని జోడించి తన స్పెల్లింగ్ ను ''Nithiin'' గా మార్చుకున్నారు.


Also Read: ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు - రామ్ చరణ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?