ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో సినిమా తప్పకుండా వస్తుంది. అందులో మరో సందేహం లేదు. అయితే, ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రామ్, హరీష్ శంకర్ సినిమా గురించి కొన్ని రోజులుగా వినబడుతోంది. 'ది వారియర్' (The Warriorr Movie) సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆ సినిమా గురించి హరీష్ శంకర్ మాట్లాడారు.
 
''కచ్చితంగా రామ్‌తో సినిమా ఉంటుంది. అయితే... అది ఎప్పుడనేది ఈ రోజు చెప్పలేను. అతని (రామ్)తో నేను సినిమా చేస్తున్నాను. అతి త్వరలో... సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడతాను'' అని హరీష్ శంకర్ చెప్పారు. 'దేవదాస్' చూసి రామ్ ఫ్యాన్ అయినట్లు ఆయన తెలిపారు. ఎన్నోసార్లు సినిమా చేయాలని ప్రయత్నించినా కుదరలేదని చెప్పుకొచ్చారు. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేసేలా సన్నివేశాలు, పాటలు, పోరాటాలు రాసుకోవడం దర్శకులకు పెద్ద సవాల్ అని హరీష్ శంకర్ అన్నారు.
 
''రామ్‌లో మంచి లక్షణం ఏంటంటే... కథ చెబుతున్నప్పుడు ఒక ప్రేక్షకుడిలా వింటాడు. ఒకసారి నేనొక సున్నితమైన ప్రేమకథ చెప్పా. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. రామ్ తరహా సినిమా కాదు. అప్పుడు నేనూ విభిన్నంగా ఏదైనా సినిమా చేయాలని అనుకున్నాను. కథ చెబుతున్నప్పుడు ఫ్యాన్ రెండు లేదా మూడులో ఉంది. అప్పుడు రామ్ ఒక మాట చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. 'మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి' అన్నాడు. అటువంటి సినిమా చేస్తా'' అని హరీష్ శంకర్ చెప్పారు. 'ది వారియర్' ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, లింగుస్వామి గారి దర్శకత్వ శైలి తనకు ఇష్టమని, ప్రేక్షకులతో పాటు జూలై 14న థియేటర్లలో సినిమా చూస్తానని ఆయన తెలిపారు. 


Also Read : వివాదంలో చిక్కుకున్న RRR రైటర్! రాజమౌళి తండ్రి వీడియో వైరల్, ఆయన మాటల్లో నిజమెంత?


'ది వారియర్' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రామ్ ప్రిపేర్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఇద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read : నిత్యానందతో పెళ్ళా? ప్రియా ఆనంద్ మాటతో షాక్‌లో ప్రేక్షకులు