Screen Writer Vijayendra Prasad Comments: దేశంలోనే సినీ రచయితల్లో ఒకరు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీ, నెహ్రూపై గతంలో RRR చిత్ర ప్రమోషన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన అప్పుడు చేసిన వ్యాఖ్యలను పలువురు చరిత్రకారులు సహా కొందరు తప్పుబడుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మహాత్మా గాంధీ వల్లే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధాన మంత్రి కాలేకపోయారని వ్యాఖ్యానించారు. జవహార్ లాల్ నెహ్రూనే ప్రధాని కావాలని గాంధీ బలంగా అనుకున్నారని, అలాగే చేశారని చెప్పుకొచ్చారు. ఒకవేళ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధాని అయ్యి ఉంటే జమ్ము కశ్మీర్ ప్రశాంతంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు జమ్ము కశ్మీర్ రావణ కాష్ఠంలా మండడానికి కారణం అప్పుడు గాంధీ తీసుకున్న నిర్ణయమే అంటూ వ్యాఖ్యానించారు.
ఆ వీడియోలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో దేశంలో 17 పీసీసీలు (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఉండేవి. బ్రిటీష్ వారు వెళ్లిపోతూ, స్వాతంత్య్రంలో కీలకంగా వ్యవహరించిన గాంధీని పిలిచి, 17 పీసీసీలతో ప్రధానిగా సామర్థ్యం ఉన్న వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. అప్పుడు గాంధీ ఆ పదవికి తగిన వ్యక్తి పేరు చిట్టీల్లో రాసిమ్మని కోరారు. 17 మందిలో 15 మంది సర్దార్ వల్లభ్ భాయ్ పేరును రాసిచ్చారు. ఒక చిట్టీలో నెహ్రూ పేరు ఉంది. మరో చిట్టీ ఖాళీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి మరో పీసీసీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నెహ్రూ పేరును నామినేట్ చేసి చివరికి ఆయన్నే ప్రధానిని చేశారు. విద్యావంతుడు, బహుభాషా వేత్త ఉంటే అంతర్జాతీయ నేతలతో మాట్లాడడానికి సులువు అవుతుందని గాంధీ నెహ్రూని ప్రధానిని చేశారు.
‘‘అందరి కోరిక మేరకు సర్దార్ వల్లభ్‌భాయ్ ను ప్రధాని చేసి ఉంటే కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యుండేది. అదే సమయంలో దేశంలో 500కు పైగా సంస్థానాలను ఎంతో చాకచక్యంగా పటేల్ భారత యూనియన్‌లో కలిపారు. అదే ప్రధాని అయ్యి ఉంటే కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించి ఉండేవారు. నెహ్రూ ప్రధాని కావడం వల్లే ఇప్పుడు కశ్మీర్ రావణ కాష్ఠంలా మండుతోంది’’ అని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
విజయేంద్ర ప్రసాద్ ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన అనంతరం ఈ వీడియో ట్విటర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.