నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా భారీ అంచనాల నడుమ గురువారం థియేటర్లలోకి వచ్చేసింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమాలో జరిగిన ఓ తప్పును మీడియా మిత్రులు లేవనెత్తగా.. దర్శకుడు అనిల్ రావిపూడి నవ్వుతూ క్షమాపణలు చెప్పారు.


'భగవంత్ కేసరి' సినిమాలో సీనియర్ నటుడు శరత్‌ కుమార్‌ జైలర్ పాత్ర పోషించారు. కథ ప్రకారం ఆయన పాత్ర చనిపోతుంది. కానీ బ్రేకింగ్‌ న్యూస్‌ లో మాత్రం సీఐ చనిపోయినట్లు వేశారు. ఇదే విషయాన్ని అనిల్‌ రావిపూడి దగ్గర ప్రస్తావించగా.. తమ టీమ్‌ తప్పిదం వల్లే అలా జరిగిందని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. "మీ సునిశిత పరిశీలనకు, మీ సూక్ష్మ బుద్ధికి, అంత పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు చిన్న తప్పుని పట్టుకున్నారంటే.. నిజంగా మీకు హ్యాట్సాఫ్. ఏదైనా అది మా తప్పే. మా వాళ్ళు ఎవరో జైలర్ బదులు సీఐ అని వేసుంటారు. దానికి మీడియా ముఖంగా క్షమాపణలు కోరుకుంటున్నాను. చిన్నదైనా తప్పు తప్పే కాబట్టి నిజయితీగా ఒప్పుకోవాలి'' అని అనిల్ అన్నారు. 


Also Read: ఓటు విలువ తెలియజెప్పే 'మార్టిన్ లూథర్ కింగ్' - సంపూర్ణేష్ బాబు ఈసారి పాలిటిక్స్ పైనే సెటైర్ వేస్తున్నాడుగా!


అలానే శ్రీలీల నుంచి ఫ్యాన్స్ ఆశించే డ్యాన్సులు, గ్లామర్ షో సినిమాలో మిస్ అయ్యిందని కొంతమంది రివ్యూలో రాయడంపై అనిల్ రావిపూడి ఘాటుగా స్పందించారు. "నేను రివ్యూలు పెద్దగా పట్టించుకోను. వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ అన్నింటి కంటే పెద్దది. జనాల నుంచి వచ్చే టాక్ ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సినిమాలోని సున్నితమైన అంశాలను అర్థం చేసుకుని చాలా మంది పాజిటివ్‌ గానే రివ్యూలు రాశారు. అయితే ఒక అమ్మాయిని షేర్ లా పెంచాలనుకునే తండ్రి కథలో, ఫోబియాతో బాధపడే అమ్మాయి నుంచి డ్యాన్సులు చూడాలనుకున్నాడంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఒక ఫోబియాతో బాధపడే అమ్మాయిని ఆర్మీకి పంపాలని అనుకుంటారు. ఇండియన్ ఆర్మీకి వెళ్లే అమ్మాయితో డ్యాన్సులు వేయించాలని రాసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకపోవడం మంచింది" అని అనిల్ ఫైర్ అయ్యారు.


'భగవంత్ కేసరి' సినిమా షానా ఏండ్లు యాదుంటాది అని ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసినప్పటి నుంచీ చెబుతున్నామని.. దాన్ని అందరూ నిజం చేశారని అనిల్ రావిపూడి అన్నారు. ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకూ ఆరు సినిమాలు చేస్తే, ఒక ఫిల్మ్‌ మేకర్‌ గా ఇది పూర్తి సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం ఎమోషన్స్. తండ్రీకూతుళ్ళ ఎమోషన్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


కాగా, 'భగవంత్ కేసరి' చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దసరా హాలిడేస్ ను క్యాష్ చేసుకొని బాలయ్య సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి నంబర్స్ సాధిస్తుందో చూడాలి.


Also Read: మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా: రేణూ దేశాయ్‌


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial