హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi) జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి వచ్చారు. ట్రాఫిక్ డీసీపీ, ఐపీఎస్ రాహుల్ హెగ్డే డ్రైవర్, కానిస్టేబుల్ అయిన చేతన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు... నోటీసులు ఇచ్చి పంపారు. అయితే... ఆమెపై నమోదు అయిన కేసు వెనుక అధికార దుర్వినియోగం జరిగిందా? కావాలని డింపుల్ హయతిని ట్రాఫిక్ డీసీపీ టార్గెట్ చేశారా? ఈ అనుమానాలు మొదలు కావడానికి కారణం డింపుల్ చేసిన ట్వీట్స్!


తప్పుల్ని దాచలేరు!
డింపుల్ హయతి, ఆమెతో పాటు విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి స్టేషన్ నుంచి బయటకు నడుస్తూ వచ్చిన విజువల్స్ మీడియాలో ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ మీద కేసు నమోదు కావడంతో ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డింపుల్ కొన్ని ట్వీట్స్ చేశారు. 


'Using power doesn't stop any mistake' అని తొలుత డింపుల్ హయతి ఓ ట్వీట్ చేశారు. 'అధికారాన్ని ఉపయోగించడం ద్వారా తప్పుల్ని ఆపలేరు' అని దానికి అర్థం అన్నమాట. ఆ తర్వాత 'Misuse of power doesn’t hide mistakes .. . #satyamevajayathe' అని మరో ట్వీట్ చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తప్పుల్ని దాచలేరని ఆమె పేర్కొన్నారు. సత్యమేవ జయతే అంటూ పేర్కొన్నారు. 










డింపుల్ హయతి చేసిన రెండు ట్వీట్స్ గమనిస్తే... ఎక్కడ కేసు గురించి నేరుగా  ప్రస్తావించలేదు. కానీ, ఆమె కేసు గురించి ట్వీట్ చేశారని సులభంగా అర్థం అవుతోంది. దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? అనేది చూడాలి. 


అసలు డింపుల్ మీద కేసు ఏమిటి?
జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ (Huda Enclave Jubilee Hills)లో డింపుల్ హయతి ఉంటున్నారు. అందులోనే ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే (Rahul Hegde IPS) సైతం నివాసం ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. 


Also Read : కన్నడ దర్శకుడితో బాలకృష్ణ పాన్ ఇండియా మల్టీస్టారర్!?


ఐపీఎస్ రాహుల్ హెగ్డే డ్రైవర్, కానిస్టేబుల్ చేతన్ ప్రతిరోజూ అపార్ట్మెంట్ సెల్లార్ ఏరియాలో కారు పార్క్ చేస్తున్నారు. పోలీస్ వాహనం పక్కనే కథానాయిక డింపుల్ హాయతి, డేవిడ్ తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రతి రోజూ డీసీపీ వాహనానికి ఉన్న కవర్ తొలగించడం, ఆ వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారని రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న పార్క్ చేసి ఉన్న డీసీపీ వాహనాన్ని తన కారుతో డింపుల్ హయతి ఢీ కొట్టారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


సీసీటీవీలో ఏం రికార్డ్ అయ్యింది?
జూబ్లీ హిల్స్ పోలీసులకు రాహుల్ హెగ్డే డ్రైవర్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అందులో డీసీపీ కారును డింపుల్ హయతి తన కారుతో ఢీ కొట్టిన విజువల్స్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే... ఆ విషయం గురించి డింపుల్ హయతి మాట్లాడలేదు. సీసీటీవీ విజువల్స్ విడుదల చేస్తే తప్పు ఎవరిది? ఎవరు ఏం చేశారు? అనేది అర్థమవుతుంది. లేదంటే డింపుల్ హయతి చేసిన ట్వీట్స్ కేవలం ఆరోపణలుగా మాత్రమే మిగులుస్తాయి. తన తప్పును కవర్ చేసుకోవడం కోసం ఎదుటి వ్యక్తి మీద ఎదురు దాడి చేసినట్టు అవుతుంది.   


Also Read గోపీచంద్‌తో 'రెడ్' బ్యూటీ - ఇద్దరికీ ఫ్లాపులే, హిట్ వస్తుందా?