సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) స్టార్‌డమ్ ఏంటనేది ఈ తరం ప్రేక్షకులు సైతం చూస్తున్నారిప్పుడు. ఆయన మేనియా, చరిష్మా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టేలా చేస్తోంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'జైలర్' అటు తమిళనాడులో మాత్రమే కాదు... తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఘన విజయం సాధించింది. రికార్డులను తిరగ రాస్తున్న ఈ సినిమాతో 'దిల్' రాజు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


'శాకుంతలం' నష్టాలు కవర్ చేస్తున్న 'జైలర్'
నిర్మాతగా తన 25 ఏళ్ళ ప్రయాణంలో ఝలక్ ఇచ్చిన సినిమా 'జైలర్' అని 'దిల్' రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన కుమార్తె నీలిమా గుణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా నిర్మాణ భాగస్వామి. 'శాకుంతలం'తో 'దిల్' రాజుకు సుమారు 25 కోట్ల వరకు నష్టాలు వచ్చి ఉంటాయని ఓ అంచనా. థియేటర్ల నుంచి ఆ సినిమాకు పెద్దగా ఏమీ రాలేదు. కానీ, డిజిటల్ & శాటిలైట్ రైట్స్ ముందు అమ్మేయడంతో కొంత వరకు సేఫ్ అయ్యారు. ఇప్పుడు ఆ 'శాకుంతలం' నష్టాలను 'జైలర్' కవర్ చేస్తున్నట్లే అని ట్రేడ్ వర్గాల్లో వినబడుతున్న మాటలను బట్టి అర్థం అవుతోంది. 


'జైలర్'ను తెలుగు రాష్ట్రాల్లో 'దిల్' రాజు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు కలిసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవరి షేర్ ఎంత? అనేది బయటకు చెప్పలేదు. 'జైలర్' కంటే ముందు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన విజయ్ 'బీస్ట్'ను కూడా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. 


'జైలర్' తెలుగు కలెక్షన్స్ విషయానికి వస్తే... విడుదలైన తొలి వారంలో రూ. 32 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా తెలుగు హక్కులను కేవలం రూ. 12 కోట్లకు మాత్రమే కొన్నారని సమాచారం. అంటే... ఆల్రెడీ 'జైలర్' ద్వారా 'దిల్' రాజు అండ్ పార్ట్నర్స్‌కు 20 కోట్లు లాభం వచ్చినట్లు లెక్క. ఈ శుక్రవారం పేరున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఇవీ విడుదల కావడం లేదు. అన్నీ చిన్న సినిమాలే. అందుకని, మరో వారం 'జైలర్'కు ఎటువంటి ఢోకా లేదు. ఆ తర్వాత 'గాంఢీవధారి అర్జున', 'బెదురులంక 2012' సినిమాలు వస్తున్నాయి. అప్పటికి 'జైలర్' జోరు కాస్త తగ్గుతుంది. ఎలా లేదన్నా... 'శాకుంతలం' ద్వారా 'దిల్' రాజుకు వచ్చిన నష్టాలను 'జైలర్' కవర్ చేస్తుందని చెప్పుకోవచ్చు.


Also Read : థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్, బుక్ మై షోలో సోల్డ్ అవుట్ - ధనుష్ సినిమాకు భారీ క్రేజ్



తమిళనాట రజనీ సరికొత్త రికార్డులు
తెలుగులో 'జైలర్'కు హిట్ టాక్ వస్తే... తమిళనాడులో సూపర్ హిట్ టాక్ వచ్చింది. మూడు వందల కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల కథనం. లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' రికార్డులను ఈ సినిమా తిరగ రాసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'జైలర్' కంటే 'విక్రమ్'కు మంచి టాక్ వచ్చింది. అయితే... మాస్ ప్రేక్షకుల్లో రజనికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా సినిమాకు విపరీతమైన వసూళ్లు వస్తున్నాయి. అక్కడ 'జైలర్' జోరు ఇప్పట్లో ఆగేలా లేదు.  


Also Read ఆంధ్రా రాబిన్ హుడ్‌గా మాస్ మహారాజా రవితేజ ఊచకోత


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial