తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (KL Damodar Prasad) అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. ఫలితాలు మొత్తం చూస్తే ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ప్యానల్ విజయం సాధించిందని చెప్పాలి.  ఆదివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఎన్నికలు జరిగాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్మాతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ఒక్కసారి ఎన్నికలలో ఎవరికీ ఎన్ని ఓట్లు వచ్చాయి? అనేది చూస్తే... 


ఎవరి వర్గం నుంచి... 
ఎంత మంది నెగ్గారు?
నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన దామోదర్ ప్రసాద్ 'ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్' నుంచి పోటీ చేశారు. 'జెమిని' కిరణ్ మీద ఆయన 24 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి నాగార్జున మేనకోడలు సుప్రియ, కె. అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. వాళ్ళిద్దరూ 'ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్' సభ్యులే. సి. కళ్యాణ్ నేతృత్వంలోని 'ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానల్' నుంచి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కోశాధికారిగా, టి. ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి సెక్రటరీలుగా ఎన్నిక అయ్యారు.
 
జాయింట్ సెక్రటరీ విజయం సాధించిన భరత్ చౌదరి కూడా 'ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్' సభ్యుడే. మరో జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో పది మంది 'దిల్' రాజు ప్యానల్ నుంచి, ఐదుగురు సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి విజయం సాధించారు. దిల్ రాజు , దానయ్య, రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాస్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు ఈసీ మెంబర్లుగా నెగ్గారు. 


మొత్తం మీద ఈ ఎన్నికల్లో 'దిల్' రాజు విజయం సాధించారు. ఇప్పుడు నిర్మాతల మండలి ఎన్నికల్లో యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు మెజారిటీ పదవుల్లో ఉన్నారు.
 
ఎన్నికలకు ముందు ఏం జరిగిందంటే?
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మొత్తం 1200 ఓట్లు ఉన్నాయి. ఈసారి సి. కళ్యాణ్ నేతృత్వంలో 'ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానల్' పేరుతో ఒక వర్గం... గిల్డ్ నేతృత్వంలోని 'ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్' (ఇందులో 'దిల్' రాజు ఉన్నారు) పేరుతో మరో వర్గం పోటీ పడ్డాయి. ఎన్నికలకు ముందు రోజు సి. కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ నిర్మాతల మండలిని కబ్జా చేయడానికి కొందరు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వాట్సాప్ గ్రూపుల్లో తమకు ఓటు వేయమంటే... తమకు ఓటు వేయమని ప్రచారం కూడా బలంగా సాగింది.  


Also Read : యాక్టర్ నరేష్ ఇల్లు, కారవాన్‌పై దాడి - రాళ్ళతో కొట్టడంతో అద్దాలు ధ్వంసం


'దిల్' రాజుతో పాటు కొంత మంది నిర్మాతలు 'ఎల్ఎల్‌పి' పేరుతో వేరు కుంపటి పెట్టుకుని వ్యాపారం చేశారని, ఆ తర్వాత 'గిల్డ్'గా మార్చారని, ఇప్పుడు నిర్మాతల మండలిపై కన్నేశారని సి. కళ్యాణ్ ప్యానల్ ప్రచారం చేసింది. తమకు పదవుల మీద ఆశ లేదని, స్వప్రయోజనాలు అసలే లేవని, నిర్మాతల పరిష్కారమే మా అజెండా అంటూ 'దిల్' రాజు ప్యానల్ కౌంటర్ ఇచ్చింది. సినిమాలు తీసే వారు నిర్మాతల మండలిలో ఉంటే అందరికీ ప్రయోజనం కలుగుతుందని చెప్పింది. సినిమా నిర్మాణం ఆపేసిన చాలా మంది పదవుల కోసం నిర్మాతల మండలిని వదలడానికి ఇష్టపడటం లేదని 'ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్' కామెంట్ చేసింది. 


Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు గురించి...