ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన సినిమా 'ధూమం' (Dhoomam Movie). మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. సినిమా సైతం ఈ భాషలు అన్నిటిలోనూ విడుదల కానుంది.


ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?
'ధూమం' అంటే 'పొగ' అని అర్థం. రోడ్డు మీద మనకు పొగరాయుళ్ళు చాలా మంది కనబడతారు. పొగ (చుట్ట, బీడీ, సిగరెట్ వగైరా వగైరా) తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, హానికరం అని ప్రభుత్వం ప్రకటనలు రూపొందిస్తోంది. వెండితెరపై హీరోలు, ఇతర నటీనటులు పొగతాగడం చూసి ప్రేక్షకులు ప్రభావితం అవుతారని సినిమా ప్రారంభానికి ముందు 'ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం... క్యాన్సర్ కారకం' అనే ప్రకటన తప్పనిసరి చేసింది. ఆ ప్రకటనల్లో 'నా పేరు ముఖేష్...' యాడ్ విపరీతంగా పాపులర్ అయ్యింది. ఇప్పుడీ ప్రకటన ప్రస్తావన ఎందుకు అంటే? 'ధూమం' సినిమాలో ఆ యాడ్స్ ప్రస్తావన ఉంది. 


'నా పేరు ముఖేష్...' తరహా ప్రకటనలను అందరూ చూసేలా చేస్తే? అని ఫహాద్ ఫాజిల్ చెప్పే సన్నివేశంతో 'ధూమం' ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అసలు కథ ఏమిటి? అనేది రివీల్ చేయలేదు. కానీ, డబ్బు కోసం ఫహాద్ ఫాజిల్ క్రైమ్స్ చేసినట్టు అర్థం అవుతోంది. ఫారిన్ హాలిడేలకు, థియేటర్లలో వచ్చే ప్రకటనలకు సంబంధం ఏమిటి? ఫహాద్ ఫాజిల్ తుపాకీ గురి పెట్టినది ఎవరికి? ఆయన ఎవరిని షూట్ చేయాలని అనుకున్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


థియేటర్లలోకి ఈ నెలలోనే 'ధూమం'
Dhoomam Release Date : ఈ నెల 23న 'ధూమం' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇందులో ఫహాద్ ఫాజిల్ జోడీగా 'ఆకాశమే హద్దురా' సినిమాలో కథానాయికగా నటించిన అపర్ణా బాలమురళి (Aparna Balamurali) నటించారు. ఇంకా రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 'ప్రేమ దేశం' వినీత్ స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. పూర్ణాచారి తేజస్వి ఎస్వీ సంగీతం అందించారు. 


Also Read : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?



ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil)కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. 'పుష్ప'లో విలన్ రోల్ చేసిన తర్వాత, అందులో నటన చూసి వాళ్ళు ఫ్యాన్స్ కాలేదు. అల్లు అర్జున్ సినిమా విడుదల కంటే ముందు నుంచి మలయాళ సినిమాలు చూసి ఆయన్ను, ఆయన నటన అభిమానించారు. 'పుష్ప', కమల్ హాసన్ 'విక్రమ్'లో ఫహాద్ ఫాజిల్ చేసిన క్యారెక్టర్లు తెలుగు ప్రేక్షకులకు ఆయన్ను మరింత దగ్గర చేశాయి.


'కెజియఫ్', 'కాంతార' సినిమాలతో హోంబలే ఫిలింస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో గౌరవం సంపాదించుకుంది. అందుకని, వీళ్ళ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. 'కెజియఫ్', 'కాంతార' తరహాలో 'ధూమం' విజయం సాధిస్తుందా? లేదా? అనేది జూన్ 23న తెలుస్తుంది. పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.


Also Read మొన్న 'రానా నాయుడు', నేడు 'సైతాన్' - స్పైసీగా తెలుగు వెబ్ సిరీస్‌లు, బూతులు & బోల్డ్ సీన్లు!