ఆరేళ్లు... మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా అభిమానుల ముందుకు వచ్చి ఆరేళ్లు! 'ట్రిపుల్ ఆర్' సినిమాలో కొమరం భీం పాత్రలో నటన కేవలం అభిమానులను మాత్రమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రముఖులను సైతం మెప్పించింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'దేవర' సోలో హీరో సినిమా. అందుకని దీనిమీద అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర అది స్పష్టంగా కనిపించింది. అభిమానుల అత్యుత్సాహం వల్ల పరిస్థితి కంట్రోల్ తప్పింది.
ఎల్ఈడీలు ఆపేశారు... లైట్లు ఆన్ చేశారు!
'దేవర' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో గల నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేశారు. తమ అభిమాన కథానాయకుడిని చూడడం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈవెంట్ దగ్గరకు విచ్చేశారు. గేట్లు ఓపెన్ చేయడం ఆలస్యం ఒక్కసారిగా జనసంద్రం తరహాలో హోటల్ లోపలికి వెళ్లారు.
ఈవెంట్ హాల్ దగ్గరకు వెళ్లే క్రమంలో అభిమానుల అత్యుత్సాహం వల్ల కొన్ని బారికేడ్లు కింద పడ్డాయి. అభిమానుల తాకిడికి మధ్యలో కొన్ని బ్యానర్లు కూడా చిరిగిపోయాయని తెలిసింది. ఒక అద్దం కూడా పగిలింది. ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయింది. అభిమానుల ఎక్కువ సంఖ్యలో రావడం, దానికి తోడు స్టేజి దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించడంతో పరిస్థితి చేయి దాటిందని ఈవెంట్ వద్దకు వెళ్లిన కొందరు చెబుతున్నారు.
'దేవర' చిత్ర బృందం తో పాటు అతిథుల కోసం ఏర్పాటు చేసిన సోఫాల వరకు అభిమానులు వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కాసేపు స్టేజి మీద ఏర్పాటు చేసిన ఎల్ఈడీలు ఆపేశారు. హాల్ లోపల లైట్లు ఆన్ చేశారు. ఇంకా ఈవెంట్ మొదలు కాలేదు. ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి ఉందని సమాచారం అందుతోంది.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే
అవుట్ డోర్ స్టేడియంలో కాకుండా ఇండోర్ స్టేడియంలో ఈవెంట్ ఏర్పాటు చేయడం వల్ల కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంతమంది దేవరని చూడడం కోసం వచ్చిన క్రౌడ్ ఎలా ఉందో అంటూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా దేవర ఈవెంట్ డిస్కషన్ పాయింట్ అయింది.
ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారా? ఏం జరుగుతోంది?
అభిమానులను కంట్రోల్ చేయడానికి చెప్పారా? లేదంటే నిజంగా పరిస్థితి కంట్రోల్ తప్పడంతో ఈవెంట్ క్యాన్సల్ చేయాలని అనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు గాని... ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పి స్టేజ్ మీద నిర్వాహకులు అనౌన్స్ చేశారు. అక్కడ పరిస్థితిని బట్టి ఎన్టీఆర్ వంటి స్టార్ కథానాయకుడిని తీసుకురావడం కంటే ఈవెంట్ క్యాన్సిల్ చేయడం బెటర్ అనేది కొంతమంది అభిప్రాయంగా తెలుస్తోంది.
Also Read: ఊరమాస్ యాక్షన్ - గూస్‌బంప్స్ ఇచ్చేలా ‘దేవర’ రిలీజ్ ట్రైలర్!