Dev Patel About Monkey Man Response: చాలామంది ఇండియన్ యాక్టర్స్.. హాలీవుడ్‌లో తమ సత్తాను చాటుకున్నారు. అలాంటి వారిలో ఒకరు దేవ్ పటేల్. తను ఏ హాలీవుడ్ సినిమాలో నటించినా.. కచ్చితంగా అందులో ఇండియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశం ఏదో ఒకటి ఉంటుంది. అలాగే తాజాగా హనుమంతుడు, హిందూ పురాణాల ఆధారంగా ‘మంకీ మ్యాన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దేవ్ పటేల్. ‘మంకీ మ్యాన్’ మూవీ ఇండియాలో విడుదల కాలేదు. కానీ ఓవర్సీస్‌లో విడుదలయ్యి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. తాజాగా ఒక ప్రేక్షకుడి రియాక్షన్ వల్ల తాను ఎమోషనల్ అయ్యానని దేవ్ పటేల్ బయటపెట్టారు.


స్పెషల్ స్క్రీనింగ్‌లో ఎమోషనల్..


‘మంకీ మ్యాన్’ మూవీలో దేవ్ పటేల్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా మొదటిసారి డైరెక్షన్ బాధ్యతలు కూడా స్వీకరించాడు. ఏప్రిల్ 19న ఈ సినిమా ఇండియాలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ సీబీఎఫ్‌సీ అనుమతి ఇవ్వకపోవడంతో ‘మంకీ మ్యాన్’ ఇండియన్ రిలీజ్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఓవర్సీస్‌లో ‘మంకీ మ్యాన్’ థియేటర్లలో విడుదలకు కొన్నిరోజుల ముందు పలు ప్రాంతాల్లో స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఎస్ఎక్స్ఎస్‌డబ్ల్యూలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్‌కు దేవ్ పటేల్ హాజరయ్యాడు. అక్కడ తాను అందరి ముందు ఎమోషనల్ కూడా అయ్యాడు. ఈ విషయం దేవ్ పటేల్ తాజాగా స్పందించాడు. అసలు తనను అంతగా ఎమోషనల్ చేసిన పరిస్థితి ఏంటని బయటపెట్టాడు. 


నాకు అర్థం కాలేదు..


‘మంకీ మ్యాన్’కు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న స్పందన తనను ఎమోషనల్ చేసిందని ఇంటర్వ్యూలో బయటపెట్టాడు దేవ్ పటేల్. ‘‘మేము ఎస్ఎక్స్ఎస్‌డబ్ల్యూకు వెళ్లినప్పుడు ఇండియాకు చెందిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను వెళ్లిపోతుండగా ఆయన నా చేయి పట్టుకొని ‘‘నా కొడుకును చూస్తే నాకు అసూయగా ఉంది’’ అన్నాడు. ఆయన ఏమన్నారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ‘‘నా కొడుకుకు 14 ఏళ్లే. నీలాంటి వాళ్లు.. అలాంటి పిల్లలు ఎలా జీవించాలో ఇలాంటి సినిమాల ద్వారా చూపిస్తున్నారు. అందుకే తను చాలా అదృష్టవంతుడు. నా కాలంలో అలా లేదు’’ అని ఆ వ్యక్తి చెప్పాడు. దానికి నేను చాలా ఎమోషనల్ అయ్యాను’’ అని చెప్పాడు దేవ్ పటేల్.


మళ్లీ అతికించేవాళ్లం..


‘మంకీ మ్యాన్’ సినిమా సమయంలో తాను ఎదుర్కున్న కష్టాలను కూడా దేవ్ పటేల్ బయటపెట్టాడు. ‘‘మా దగ్గర కేవలం మూడు, నాలుగు టేబుల్స్ మాత్రమే ఉండేవి. అందుకే నేను ఏదైనా పెద్ద యాక్షన్ సీన్ చేసిన వెంటనే కట్ అని చెప్పేవాడిని. ఆ తర్వాత నేను, నా టీమ్ కలిసి విరిగిపోయిన చెక్క ముక్కలను మళ్లీ అతికించేవాళ్లం. దాంతో తరువాతి షాట్ షూట్ చేసేవాళ్లం’’ అని తెలిపాడు. ఇక ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన కథ అయినా కూడా ‘మంకీ మ్యాన్’కు ఓవర్సీస్‌లో విపరీతంగా ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలో దేవ్ పటేల్‌కు జోడీగా శోభితా దూళిపాళ నటించింది. వీరితో పాటు సికందర్ ఖేర్, మకరంద్ దేశ్‌పాండే, పితోబాష్, విపిన్ శర్మ.. వంటి నటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.



Also Read: క్రికెటర్ రిషబ్ పంత్ కోసం చెప్పులు లేకుండా 46 కిమీలు నడిచిన ఊర్వశీ రౌతెలా?