'Dasara' in 100 Cr Club: హీరో నాని  'దసరా' సినిమాతో రికార్డు సృష్టించి, అనుకున్నది సాధించారు. ఆయన కెరీర్ లో రెండో సారి రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి తాజాగా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర ప్రకటించారు. దీంతో నాని ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే 'దసరా' బిగ్గెస్ట్ హిట్ అండ్ బిగ్గెస్ట్ కలెక్షన్ల జాబితాలోకి చేరిపోయింది. ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్టు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. దాంతో పాటు ఓ అఫిషియల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. దీంతో మరోసారి 'దసరా' మూవీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'దసరా' సినిమాను శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజైంది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ క్రేజ్ ను సంపాదించుకోగా.. రిలీజ్ తర్వాత కూడా అదే జోరును సాగిస్తూ వచ్చింది. రొటీన్ సినిమాలకు గుడ్ బై చెప్పి.. 'దసరా'తో డిఫరెంట్ మూవీ ట్రై చేసిన నానికి ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. మరో ముఖ్య విషయమేమిటంటే రిలీజైన మొదటి 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా రికార్డు సృష్టించింది. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా.. తొలి రోజు రూ.38 కోట్లు, రెండో రోజు రూ.53 కోట్లు, 3వ రోజున రూ. 71కోట్లు, 4వ రోజు నాటికి రూ.87 కోట్లు, ఐదో రోజుకు రూ.92 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఈ సినిమాలో నాని మాస్ యాక్టింగ్, డైరెక్టర్ విజువల్ నరేషన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల నటన, సినిమా సాంగ్స్, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ కూడా  సినిమాకు మరో ప్లస్ పాయింట్స్ గా మారి, ఈ రోజు బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. 


ఈ సందర్భంగా హీరో నాని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'దసరా' సినిమా రూ.100కోట్లు వసూళ్లు చేసిన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. దాంతో పాటు మా కృషికి మీరిచ్చిన కానుకతో సినిమా విజయవంతం అయిందంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. 




ఇంతకుముందు నాని, సమంత జంటగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' సినిమా రూ.125కోట్లు కలెక్ట్ చేయగా.. రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న 'దసరా' సినిమా రూ.100 కోట్లు వసూలు చేసి, నాని కెరీర్ లో రెండో రూ.100కోట్ల సినిమాగా నిలిచిపోయింది. ఇక దసరా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో చిత్రయూనిట్ తో పాటు నాని, కీర్తి సురేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అటు అమెరికాలోనూ ఈ మూవీ 2 మిలియన్ డాలర్స్ సాధించి నాని కెరీర్ లోనే అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ సాధించిన మొదటి సినిమాగా నిలవడం విశేషం. ఇక ఈ సినిమా 100 కోట్లు సాధించడంతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో ద్వారా విషెస్ చెబుతున్నారు.