లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు చేయడం మ్యాన్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు కొత్త ఏమీ కాదు. ఓ స్థాయి దాటి హీరోయిజం చూపించడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండరని చెప్పాలి. ఆ బాలకృష్ణ మరొకసారి లార్జర్ దేన్ లైఫ్ రోల్ చేస్తూ చేసిన సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
బాలయ్య మాస్... ఈ రేంజ్ చూశారా?
బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన సినిమా 'డాకు మహారాజ్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది.
బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ సీక్వెన్సలు, స్టెప్స్ వేయించే సాంగ్స్, మంచి కథ, కథనాలు సినిమాలో ఉన్నట్టు అర్థం అవుతుంది. ఇక ట్రైలర్ చివరలో బాలయ్య చెప్పే మైఖేల్ జాక్సన్ డైలాగ్ అదిరింది. 'అనగనగా ఒక రాజు ఉండేవాడు' అంటూ ఒక చిన్నారి కథ చెప్పడం ప్రారంభించింది. అప్పుడు గుర్రాలపై కొందరు వ్యక్తులు స్క్రీన్ మీద కనిపించారు. ఆ తర్వాత రౌడీ మూకలు కనిపించాయి. 'చెడ్డ వాళ్లంతా ఆయన డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజు' అని ఆ చిన్నారి చెప్పినప్పుడు బాలకృష్ణ క్యారెక్టర్ పరిచయం చేశారు.
Daaku Maharaaj Trailer Released: సంక్రాంతి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈరోజు అమెరికాలో జరిగింది. జనవరి 4వ తేదీన అమెరికాలో రాత్రి 09.09 గంటలకు ట్రైలర్ విడుదల చేశారు. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 5వ తేదీ ఉదయం 08.39 గంటలకు విడుదల అన్నమాట. 'డాకు మహారాజ్' ట్రైలర్ చూస్తే... బాలకృష్ణ మాస్ చాలా కొత్తగా ఉంది. ఆయనను దర్శకుడు బాబి చాలా కొత్తగా చూపించారని చెప్పాలి.
బాలకృష్ణకు జంటగా హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్ర చేశారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల స్పెషల్ సాంగ్ చేశారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాబీ డియోల్ విలన్ రోల్ చేసిన ఈ సినిమాలో మకరంద్ దేశ్ పాండే మరొక క్యారెక్టర్ చేశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.