ఏపీ, తెలంగాణలో థియేటర్లో సందడి మొదలైంది.  థియేటర్లలో సినిమా చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, థియేటర్లలోనే తమ సినిమాను విడుదల చేద్దామని వేచిచూస్తున్న సినిమా వాళ్లకు రెండు ప్రభుత్వాలు గుడ్ న్యూస్  చెప్పాయి. 


ఇవాళ్టి నుంచి ఏపీలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాలని  ప్రభుత్వం ఆదేశించింది.   కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ తో రాష్ట్రంలో థియేటర్లు దాదాపు ఏడాదిన్నర నుంచి మూతపడే ఉన్నాయి. 


ఆ మధ్య కరోనా కాస్త తగ్గుముఖం పట్టినప్పుడు థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ భారం అవుతుందని చాలా థియేటర్ల యజమానులు థియేటర్లు తెరిచేందుకు ముందుకురాలేదు. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఆ కొద్ది థియేటర్లు కూడా తిరిగి మూతపడ్డాయి. 


కరోనా థర్డ్ వేవ్ కేసులు హెచ్చరికలు వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే  సినిమా థియేటర్లు తెరిచేందుకు యజమానులు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారనేది వేచిచూడాలి. టికెట్ ధర విషయంలోనూ థియేటర్ యజమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. టికెట్ ధరలపై ప్రభుత్వం సడలింపులు ఇస్తే కరోనా నష్టాల నుంచి కొంచమైనా కోలుకుంటామని డిస్టిబ్యూటర్లు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని వేడుకుంటున్నారు. 


కొన్నాళ్లుగా థియేటర్లు క్లోజ్ అవడంతో.. ప్రేక్షకుల సందడి మిస్ అయ్యింది. థియేటర్లు బోసి పోతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో మార్చి 21 నుంచి తెలంగాణ సర్కార్‌ నైట్‌ కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి థియేటర్లు బంద్‌ అయ్యాయి. దీంతో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. ప్రతి శుక్రవారం బాక్సాఫీసు హోరు, ప్రేక్షకుల జోరు థియేటర్ల దగ్గర కనిపించడంలేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత థియేటర్ల ఓపెనింగ్‌తో కొత్త సినిమాల కళ సంతరించుకోనుంది.


తెలంగాణలో 100 శాతం 


తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరచుకునున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం కొన్ని వారాల క్రితమే అనుమతి ఇచ్చినా యాజమాన్యాలు కరోనా ప్రభావం నుంచి కోలుకోడానికి సడలింపులు కోరారు. పార్కింగ్ ఛార్జీల వసూళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సడలింపు తర్వాత థియేటర్లు తెరచుకుంటున్నాయి. ఐనాక్స్, జీవీకే వన్, పీవీఆర్ వంటి సంస్థలు కూడా ఈ రోజు థియేటర్లు ఓపెన్ చేశాయి. 


 


Also Read: Guntur Electric Shock: గుంటూరు జిల్లాలో ఘోరప్రమాదం.. విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి... అందరూ ఒడిశా వాసులే