గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఘోర ప్రమాదం జరిగింది. రొయ్యల చెరువు వద్ద విద్యుదాఘాతానికి గురై ఆరుగురు మృతి చెందారు. మృతులంతా ఒడిశా వాసులని తెలుస్తోంది.  


రొయ్యల చెరువు వద్ద కాపలాగా పనిచేస్తున్న వీరు... గురువారం రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉన్న షెడ్డులో  ఉండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్​కు గురైనట్లు సమాచారం.  షెడ్డుపై కరెంటు తీగలు పడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మృతులను రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, నవీన్, మహేంద్ర​గా పోలీసులు, అధికారులు గుర్తించారు. 


ప్రమాదంపై అనుమానాలు


విద్యుదాఘాతం ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఘటనా స్థలం వద్దకు పోలీసులు మీడియాను కూడా అనుమతించడం లేదు.  విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తున్నా.... షార్ట్​ సర్క్యూట్​ అయి ఉండకపోవచ్చునని విద్యుత్​ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రమాదంపై ఇంకా స్పష్టత రాలేదు.


ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ విశాల్ గున్ని 



లంకెవానిదిబ్బలో ప్రమాద స్థలాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బ్లాస్టింగ్ జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేవన్న ఆయన.. ప్రమాదం జరిగిన సమయంలో గది నుంచి ఇద్దరు బయటకు వచ్చినట్లు చెబుతున్నారన్నారు. వాళ్ళిద్దరూ షాక్ లో ఉన్నారన్నారు. బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్లు అధికారులు చెప్పారని ఎస్పీ తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగానే భావిస్తున్నామన్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన ఆరుగురు వ్యక్తులు చనిపోయారన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆక్వా కంపెనీ ఓనర్, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నామని... అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధ్యుతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.


 


Also Read: Covid19 Updates: తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ పడింది.. ఏపీలో 50 శాతం, తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న థియేటర్లు