తెలుగు తేజం పీవీ సింధు మరో ఆశ్యర్యకరమైన పోరుకు సిద్ధమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఈ రోజు సింధు... జపాన్‌కు చెందిన అకానె యమగూచితో తలపడనుంది. మధ్యాహ్నం 1.15 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. క్వార్టర్స్‌లో సింధు గెలిస్తే సెమీఫైనల్ చేరి కనీసం పతకం ఖాయం చేసుకుంటుంది.
జపాన్ క్రీడాకారిణి, స్వర్ణం గెలిచే సత్తా ఉన్న యమగూచితో క్వార్టర్‌ఫైనల్లో సింధు తలపడనుంది. యమగూచిపై సింధుకి 11-7తో మెరుగైన గెలుపోటముల రికార్డు ఉంది. చివరి సారిగా వీరిద్దరు ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో తలపడ్డారు. 76 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సింధుదే విజయం. ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో ఉన్న యమగూచి ప్రస్తుతం ఫామ్ లేక సతమతమౌతోంది. ఇది కాస్త సింధుకు కలిసొచ్చే అంశం.
సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో తీవ్రమైన ఒత్తిడి యమగూచికి అదనపు భారం. ఇప్పటికే టెన్నిస్‌లో నవోమి ఒసాకా, బ్యాడ్మింటన్‌లో కెంటొ మొమొట నిష్క్రమణలే ఇందుకు నిదర్శనం. వీరిద్దరు తమ క్రీడాంశాల్లో కచ్చితంగా స్వర్ణం గెలుస్తారని అనుకున్నారు. కానీ, తీవ్రమైన ఒత్తిడి కారణంగా తొలి రౌండ్లలోనే ఇంటిముఖం పట్టారు. శుక్రవారం యమగూచి పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. ఆమె ఒత్తిడికి తలొగ్గితే సింధు విజయం మరింత తేలికవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో యమగూచి ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుస సెట్లలో విజయం సాధిస్తూ వచ్చింది.
గ్రూపు దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో సింధు స్థాయికి తగ్గట్లు ఆడినట్లు అనిపించలేదు. కానీ, గురువారం ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో మాత్రం ప్రత్యర్థిపై విరచుకుపడే సింధును చూశాం. ఆరో సీడ్ సింధు 21-15, 21-13తో ప్రపంచ 12వ ర్యాంకర్ మియా బ్లిక్‌ఫెల్ట్ (డెన్మార్క్)ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌కు ముందు అంతా గట్టి పోటీ తప్పదనుకున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని అవలీలగా సింధు మట్టికరిపించింది.
41 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సింధు ధాటికి ప్రత్యర్థి విలవిలలాడింది. కోర్టులో నలువైపులా రాకెట్ వేగంతో కదిలిన సింధు షటిల్‌ను సమర్థంగా అవతలి కోర్టులోకి నెట్టింది. తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన బ్లిక్‌ఫెల్ట్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-13తో రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను సింధు సొంతం చేసుకుంది. బ్లిక్‌ఫెల్ట్‌పై తన గెలుపోటముల రికార్డును 5-1తో మరింత మెరుగు పరుచుకుంది.
మరి, ఈ రోజు మ్యాచ్లో ఎవరు విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంటారో చూడాలి. సింధు X యమగూచి మ్యాచ్ కోసం యావత్తు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్, ఫైనల్లో కూడా గట్టి ప్రత్యర్థులతో తలపడనుంది. సింధు కచ్ఛితంగా స్వర్ణ పతకం తెస్తుందని అందరూ భారీగా అంచనాలతో ఉన్నారు. రియో ఒలింపిక్స్‌లోని రజతాన్ని సింధు స్వర్ణం చేసుకుంటుందో లేదో చూడాలి.