శ్రీలంకతో జరిగిన మూడో T20 మ్యాచ్‌లో భారత్‌కు  ఘరోపరాజయం ఎదురైంది. ఈ విజయంతో శ్రీలంక టీ20 సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. బర్త్‌డే రోజున ఆల్‌రౌండర్ హసరంగ విజృంభణతో రికార్డు విజయాన్ని సొంత చేసుకుంది శ్రీలంక.


ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ౩ వికెట్లు చేజార్చుకొని 14.3 ఓవర్లలోనే ఛేదించింది. ధనంజయ డిసిల్వ, వానిండు హసరంగ చివరి వరకు క్రీజులో నిల్చొని జట్టును గెలిపించారు. టాప్ ఆర్డర్‌మెన్ అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక సమర విక్రమ ఫెయిల్ అయినా ధనంజయ డిసిల్వ, హసరంగ జట్టును ఆదుకున్నారు. ధనంజయ డిసిల్వ 20 బంతుల్లో 23 పరుగుల చేస్తే... హసరంగ 9 బంతుల్లో 14 పరుగుల చేశారు. 


ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్‌ తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది  వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్‌ 23 పరుగులతో భువనేశ్వర్‌ కుమార్ 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లు వానిండు హసరంగ నాలుగు వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఈయనతోపాటు డాసున్ శనక రెండు వికెట్లు తీశాడు. వీళ్లద్దరు కెరీర్ బెస్ట్ నమోదు చేశారు. 


తొలి ఓవర్‌లోనే కెప్టెన్ ధావన్‌ను ఔట్‌ చేసిన లంక టీం... ఎక్కడా టీమిండియాను కోలుకోనివ్వలేదు. ప్రతి ఓవర్‌కు ఓ వికెట్ తీస్తూ ఎక్కడా స్కోరు బోర్డు పరుగులు పెట్టకుండా జాగ్రత్త పడింది. 


36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా టీ20 క్రికెట్‌లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసేలా కనిపించింది. కానీ భువనేశ్వర్, కులదీప్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆరో వికెట్‌కు 19 పరుగులు జోడించారు. చివరికి భువనేశ్వర్ 15వ ఓవర్‌లో ఔటయ్యాక.. టెయిలెండర్లతో కలిసి కులదీప్‌ టీం స్కోరును 81కు చేర్చాడు. దీంతో భారత్‌కు టీ20ల్లో మరో అత్యల్ప స్కోర్ కాకుండా చూసుకున్నాడు 


అటు బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన శ్రీలంక ఆటగాడు వానిండు హసరంగ.. మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. 2008 తర్వాత భారత్‌పై శ్రీలంక ఓ ద్వైపాక్షిక సిరీస్‌ గెలవడం ఇదే ఫస్ట్ టైం. 


బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా మూడో T20 మ్యాచ్‌లో చతికిల పడింది. స్పిన్ మాయా జాలంతో భారత్‌ను గట్టిగానే దెబ్బతీసింది. అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు అందుకున్న యువభారత్‌... అంచనాలు అందుకో లేకపోయింది. పేలవమైన ఆట తీరుతో కన్ఫ్యూజన్‌లో వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక టూర్‌లో వన్డే సిరీస్ గెలిచామన్న ఆనందమే భారత్‌కు మిగిలింది. 


ALSO READ: శుక్రవారం మ్యాచ్‌ల వివరాలు... సెమీఫైనల్‌లో స్థానం కోసం యమగూచి X పీవీ సింధు