Telugu Coastal Backdrop Movies: తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు సముద్రం వైపు చూస్తోంది. మన దర్శకుల ఆలోచనలన్నీ అలల వైపు పరుగులు తీస్తున్నారు.. తీర ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథలను తెర మీద ఆవిష్కరించడానికి కష్ట పడుతున్నారు. అలాంటి సినిమాల కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. హీరోలు సైతం కోస్టల్ బ్యాక్ డ్రాప్ కథలపై ఆసక్తి కనబరుస్తున్నారు. కుర్ర హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ.. అందరూ సాగరం నేపథ్యంలో సాగే సినిమాల్లో నటిస్తున్నారు. 


'తండేల్'
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'తండేల్'. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. బోట్లు నడిపే వారిని తండేలు అని పిలుస్తారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీస్తున్నారు. రీసెంట్ గా చైతూ బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. ఇందులో చై ఒక బెస్త వాడి పాత్రలో కనిపించారు. రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టారు.


గుజరాత్‌ రాష్ట్రం సూరత్ లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందట. దీని కోసం చిత్ర బృందం చాలా రీసెర్చ్ చేశారు. హీరో నాగ చైతన్య మత్స్యకారుల జీవనశైలి గురించి తెలుసుకోవడమే కాదు.. వారి బాడీ లాంగ్వేజ్ లోకి మారడానికి, సిక్కోలు యాసలో మాట్లాడటానికి చాలా శ్రమిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


'దేవర'
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తొలిసారిగా పూర్తిగా సముద్రం నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా కథంతా తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతుంది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. ఇప్ప‌టికే ఒక పాత్ర‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను వదిలారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్ గా కనిపించనున్నారు.


'దేవర' కోస్టల్ ల్యాండ్స్ లో జరిగే కథ కావడంతో ప్రత్యేకంగా భారీ సెట్స్ నిర్మించి షూటింగ్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్‌ లోనే అద్భుత‌మైన స‌ముద్రాన్ని సృష్టించడానికి కృషి చేస్తున్నారు. దీని కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌నే రంగంలోకి దించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ పాన్ ఇండియా సినిమాని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.


Also Read: ఎన్నికలను సైతం సినిమాల ప్రచారం కోసం వాడేస్తున్న టాలీవుడ్!


కాసుల వర్షం కురిపిస్తున్న కోస్టల్ బ్యాక్ డ్రాప్... 
నిజానికి సినిమాలకు, సముద్రానికి విడదీయరాని అనుబంధం ఉంది. గతంలో కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన అనేక చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అయితే 'ఉప్పెన' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత ఈ బంధం మరింత ధృఢంగా మారింది. వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మించారు. సినిమా కథంతా సాగర తీరంలోనే జరుగుతుంది. ఇందులో హీరో ఫిషర్ మ్యాన్ గా కనిపిస్తాడు.


మేన‌ల్లుడి బాటలో మెగాస్టార్... 
మెగా మేన‌ల్లుడి బాటలో మెగాస్టార్ చిరంజీవి కూడా సముద్ర తీరానికి వెళ్ళొచ్చారు. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో 'వాల్తేరు వీరయ్య' వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు ఒక జాల‌రి పాత్ర‌లో కనిపించారు. వింటేజ్ యాక్షన్ తో విశ్వ‌రూపం చూపించి, బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటారు. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించాయి. వాల్తేరు వీరయ్య రూ.240 కోట్ల వరకు కలెక్ట్ చేయగా, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అక్కినేని, నందమూరి హీరోలు నాగచైతన్య, ఎన్టీఆర్ లు కూడా తీర ప్రాంత కథల్లో నటిస్తున్నారు.


RC16 & ఓజీ...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రాబోయే RC16 సినిమా కథకు సముద్రంతో లింక్ ఉంటుందని అంటున్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'OG' మూవీ కథ ముంబై షిప్పింగ్ యార్డ్ నేపధ్యంలో సాగుతుందని టాక్. మొత్తానికి టాలీవుడ్ లో ప్రస్తుతం సముద్ర తీర ప్రాంత సినిమాలు తీయడం ట్రెండ్ గా నడుస్తోంది. మరి ఈ సీ బ్యాక్ డ్రాప్ ఎవరెవరిని విజయ తీరాలకు చేర్చుతుందో వెయిట్ అండ్ సీ!



Also Read: టాలీవుడ్​లో రీ-రిలీజుల ట్రెండ్​కు ఎండ్ కార్డ్ పడినట్లేనా? 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply