ఒకే టైటిల్‌ తో రెండు వేర్వేరు సినిమాలు రావడం మనం గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ఒకే భాషలో లేదా వేర్వేరు భాషల్లో సేమ్ టైటిల్ తో తెరకెక్కిన సినిమాలు కూడా చూసుంటాం. కానీ ఒకే టైటిల్‌తో రూపొందిన రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కావడం ఎప్పుడూ చూడలేదు. అలాంటి అరుదైన రోజును మనం చూడబోతున్నాం. 'జైలర్' అనే పేరుతో తీసిన రెండు సినిమాలు ఇప్పుడు ఒకే తేదీన థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి.


సూపర్ స్టార్ రజనీకాంత్‌, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ కాంబినేషన్ లో 'జైలర్' అనే యాక్షన్ కామెడీ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించి, ప్రమోషన్స్ షురూ చేశారు. అయితే అదే 'జైలర్' టైటిల్ తో మలయాళంలో మరో మూవీ రూపొందుతోంది. ధ్యాన్‌ శ్రీనివాసన్‌ హీరోగా షకీర్ మదత్తిల్ అనే దర్శకుడు ఈ సినిమా తీస్తున్నారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు రజినీకి పోటీగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడమే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.


నిజానికి 'జైలర్' సినిమాని అనౌన్స్ చేసిన తర్వాత, ఆ టైటిల్ తమదేనంటూ దర్శకుడు షకీర్ కోర్టును ఆశ్రయించారు. 2021 ఆగస్టులోనే కేరళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో తాము 'జైలర్' టైటిల్ ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. అదే ఏడాది నవంబరులో షూటింగ్ ప్రారంభించామని, కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయన్నారు. అంతేకాదు దుబాయ్ షార్జాలో 2022 జూన్‌ 26న ఓ ఈవెంట్ లో టైటిల్‌ పోస్టర్‌ ని కూడా లాంచ్ చేశామని, ఆ ఈవెంట్ కు కమల్‌ హాసన్‌, మంజు వారియర్‌ వంటి ప్రముఖుల హాజరయ్యారని వెల్లడించారు. 


కానీ అదే టైటిల్ తో రజినీకాంత్ సినిమా చేస్తున్నారని, వెంటనే మలయాళ వెర్షన్ టైటిల్ మార్చుకోవాలని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థను డిమాండ్ చేశారు మలయాళ 'జైలర్' మేకర్స్. దానికి అంగీకరించకపోవడంవల్లనే కోర్టుకు వెళ్లినట్లు డైరెక్టర్ షకీర్ తెలిపారు. రెండు సినిమా కథల నేపథ్యం వేరైనప్పటికీ, టైటిల్ ఒకటే అవ్వడం వల్ల ప్రేక్షకులు సందిగ్ధతకు గురవుతారని.. అది సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని దర్శకుడు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై త్వరలోనే కోర్టు హియరింగ్ ఉంది. 


Read Also: భయపెడుతోన్న ప్రభాస్, అయోమయంలో యశ్ - పాన్ ఇండియా స్టార్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా?


అయితే టైటిల్ వివాదం ఇప్పుడప్పుడే తేలేలా లేదని భావించిన మళయాళ దర్శక నిర్మాతలు.. తమ 'జైలర్' చిత్రాన్ని కూడా ఆగస్ట్ 10వ తేదీనే విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి, తమిళ జైలర్ మేకర్స్ కు షాక్ ఇచ్చారు. ఒకే రోజు ఒకే టైటిల్‌ తో రూపొందిన రెండు డిఫ‌రెంట్ లాంగ్వేజ్ మూవీస్ పోటీ ప‌డ‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 


ఈ రెండు సినిమాల పేర్లు, హీరోలు పాత్రలు ఒకటే అయినప్పటికీ, రెండు కథలు నేపథ్యాలు వేర్వేరు. కాకపోతే రజనీకాంత్ నటించిన 'జైలర్' అనేది పాన్ ఇండియా సినిమా. అన్ని భాషలతో పాటుగా మలయాళంలోనూ రిలీజ్ అవుతుంది. కానీ అదే రోజు సేమ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మరో మూవీ విడుదలయితే మాత్రం, మాలీవుడ్ జనాలు గందరోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది కేరళలో ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు. 


ఏదైమైనా రజనీకాంత్ సినిమా ఇలా విడుదలకు ముందు టైటిల్ వివాదంలో చిక్కుకోవడం, ఇప్పుడు మలయాళ 'జైలర్' సేమ్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడం వంటివి సూపర్ స్టార్ అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే సన్ పిక్చర్స్ వారు లేటెస్ట్ పోస్టర్స్ లో 'Rajini The Jailer' అని ప్రమోట్ చేయడాన్ని బట్టి చూస్తుంటే, టైటిల్ ను 'ది జైలర్' గా మారుస్తారనిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చి, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. 


Read Also: బాలయ్య Vs రవితేజ Vs విజయ్ - ఈసారి బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial