ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ (Jani Master) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'యథా రాజా తధా ప్రజా' (Yatha Raja Tatha Praja Movie). హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
'యథా రాజా తధా ప్రజా' ప్రత్యేకత ఏంటంటే... తెలుగు, తమిళం, కన్నడ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే... రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న వినోదాత్మక చిత్రమిది. సాధారణంగా కొరియోగ్రాఫర్స్ హీరోలుగా మారినప్పుడు డ్యాన్స్ బేస్డ్ సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటారు. జానీ మాస్టర్ కొత్తదనం కోసం ఈ తరహా కథ ఎంపిక చేసుకున్నారు. ఇందులో 'సినిమా బండి' ఫేమ్ వికాస్ మరో కథానాయకుడు. కథానాయికగా 'ఢీ' ఫేమ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ నటిస్తున్నారు.
శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు. ప్రారంభోత్సవంలో దర్శక - నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ ''కథ పూర్తయిన తర్వాత హీరోగా ఎవరికి అయితే బావుంటుందని ఆలోచిస్తున్నప్పుడు జానీ మాస్టర్ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన కథలు వింటున్నారు. నేను 20 నిమిషాల్లో కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఒకప్పుడు టీవీల్లో రాజకీయ వార్తలను 10 మినిట్స్ చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు చూపించే ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు రాజకీయాలు అంటే అందరిలో ఆసక్తి ఉంది. ఆ నేపథ్యంలో పొలిటికల్ అండ్ సెటైరికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. వాణిజ్య హంగులతో కూడిన సందేశాత్మక చిత్రమిది. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
Also Read : హాలీవుడ్‌కు 'ఆర్ఆర్ఆర్' షాక్ - ఇప్పుడు బెస్ట్ యాక్షన్ మూవీస్ లిస్టులో
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన సినిమా ప్రారంభం కావడం సంతోషంగా ఉందని జానీ మాస్టర్ అన్నారు. తమకు 'యథా రాజా తధా ప్రజా' టైటిల్ ఐడియా ఇచ్చిన రైటర్ నరేష్‌కి ఆయన థాంక్స్ చెప్పారు. కథ వినగానే నచ్చిందని ఆయన అన్నారు. చిత్ర బృందంలో ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకున్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన శర్వానంద్, ఆయుష్ శర్మలకు కూడా ఆయన థాంక్స్ చెప్పారు. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని, చిత్ర బృందం సహకారంతో అద్భుతమైన బాణీలు వస్తున్నాయని సంగీత దర్శకుడు రధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్, సినిమాటోగ్రాఫర్ సునోజ్ వేలాయుధన్, గణేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.