'బలగం' సినిమా విడుదలకు ముందు తెలుగు ప్రేక్షకులకు హాస్య నటుడిగా వేణు (Jabardasth Venu) తెలుసు. వెండితెరపై పలు సినిమాల్లో హీరో స్నేహితుడిగా వినోదం పంచినప్పటికీ... 'జబర్దస్త్' కార్యక్రమం ఆయనకు ఎక్కువ పేరు, గుర్తింపు సంపాదించి పెట్టింది. దాంతో 'జబర్దస్త్' వేణుగా ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అయితే, 'బలగం' సినిమా వేణులో (Venu Yeldandi Director) దర్శకుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. 


కామెడీ సినిమాతో కాకుండా భావోద్వేగభరిత చిత్రంతో, కుటుంబ సంబంధాలు & గొడవల నేపథ్యంలో కథతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'బలగం' తీశారు. ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల సినిమా చూశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'భోళా శంకర్' లొకేషన్‌కు పిలిపించుకుని చిత్ర బృందాన్ని అభినందించారు.  


చిరు కాళ్ళ మీద పడిన వేణు
'హాయ్ వేణు... కంగ్రాచ్యులేషన్స్! గుడ్ జాబ్' అని చిరంజీవి అభినందిస్తుంటే... ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు వేణు. 'కాదయ్యా... నువ్వు సినిమా ఇంత బాగా తీసి మాకు షాకులు ఇస్తే ఎలా చెప్పు?' అంటూ శాలువా కప్పి వేణును చిరు సత్కరించారు.
 
''నిజాయతీ ఉన్న సినిమా 'బలగం'. అది ట్రూ ఫిల్మ్. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నా గానీ... సినిమాలో నిజాయతీ ఉంది. వేణు నిజాయతీగా తీశాడు. సినిమాకు న్యాయం చేశాడు. చాలా బావుంది. మంచి నేటివిటీ, తెలంగాణ సంస్కృతిని వంద శాతం చూపించాడు. అతను చిన్నతనం నుంచి చూసిన ప్రతిదీ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యింది. ఒకసారి 'జబర్దస్త్'లో ఒగ్గు, బుర్ర కథలు వంటివి తీసుకుని స్కిట్ చేశాడు. నేను అది చూశా. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి అతని మీద గౌరవం పెరిగింది. అతనిలో అంత టాలెంట్ ఉందా? అనుకున్నా. ఈ సినిమా చూసిన తర్వాత... గొప్పగా తీశాడని అనుకున్నా'' అని చిరంజీవి చెప్పారు. 


Also Read ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్ 






చిరంజీవికి అన్నయ్య కుమారుడు హర్షిత్ రెడ్డి, కుమార్తె హన్షిత రెడ్డి, 'బలగం' చిత్ర బృందాన్ని 'దిల్' రాజు పరిచయం చేశారు. ప్రియదర్శి, హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్, గేయ రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు చిరును కలిశారు. 'భోళా శంకర్'లో నటిస్తున్న కీర్తీ సురేష్, రఘుబాబు తదితరులు సైతం 'బలగం' బృందాన్ని చిరు అభినందించినప్పుడు అక్కడ ఉన్నారు. 


'బలగం' సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. తాతయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి నటించారు. ఈ ముగ్గురితో పాటు ప్రతి పాత్రకు ఆర్టిస్టులు ప్రాణం పోశారు. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్ రాసిన పాటలు, భీమ్స్ అందించిన బాణీలు ఎంతో బలంగా నిలిచాయి. కథలో ఆత్మను ఆవిష్కరించాయి. సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణలో మాత్రమే కాదు, ఏపీలోనూ చూస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. 


'బలగం' ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుంది. ఏప్రిల్ తొలి వారంలో సినిమా స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం.


Also Read మగువ మీద మదము చూపే జన్మ దేనికి? - మృగాళ్లను ప్రశ్నించిన పాట