మెగాస్టార్ చిరంజీవి తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకొని వార్తల్లో నిలిచారు. నిన్న రాత్రి చిరంజీవి లండన్ లోని యూకే పార్లమెంట్లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్యం పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అరుదైన ఘనత అందుకున్న మొట్టమొదటి భారతీయుడు చిరంజీవి కావడం తెలుగు వారికి గర్వ కారణం. 


యూకే పార్లమెంట్ లో మెగాస్టార్ కు అరుదైన గౌరవం 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కారం అందుకున్నారు. అక్కడ ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేయడం విశేషం. 4 దశాబ్దాల నుంచి సినిమా రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారంతో గౌరవించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవీన్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరగగా, పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్ మాన్, సోజన్ జోసెఫ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 


పవన్ కళ్యాణ్ రియాక్షన్ 
ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ అందుకున్న ఈ అరుదైన గౌరవంపై ఆయన సోదరుడు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. సినీ, సేవా రంగాల్లో చేసిన విశేష కృషికి ఫలితంగా చిరంజీవి యూకే పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడంపై పవన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు తమ్ముడుగా పుట్టడం గర్వంగా ఉందంటూ, చిరంజీవి కీర్తి కిరీటంలో ఈ పురస్కారం మరో కలికితు రాయి అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. "ఒక మధ్య తరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జర్నీ మొదలు పెట్టి, కళామ తల్లి దీవెనలతో, స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగారు. నాలుగున్నర దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను అలరిస్తూ, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. మీకు తమ్ముడిగా పుట్టడం గర్వంగా ఉంది. మిమ్మల్ని అన్నయ్యగా కంటే తండ్రిగా భావిస్తాను" అంటూ పవన్ పోస్ట్ చేశారు. 






మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే ఎన్నో అత్యున్నత పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (IIFA) అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా వంటి అరుదైన గౌరవాలను దక్కించుకున్నారు. 156 సినిమాలు 537 పాటలు 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అదరించినందుకు ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఆయనను ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం ఇచ్చి నాగార్జున గౌరవించారు. అలాగే గతేడాది దేశంలో రెండో అత్యున్నత గౌరవం అయిన పద్మ విభూషణ్ పురస్కారం కూడా మెగాస్టార్ ను వరించింది.