Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలైయ్యాయి. రామ్ చరణ్ తండ్రి అయ్యారు. ఉపాసన మంగళవారం పండంటి పాపకు జన్మనిచ్చింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసనకు డెలివరీ అయింది. మహాలక్ష్మి రాకతో మెగా ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి. అలాగే టాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ ఉపాసన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మనవరాలి రాకతో మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో మునిగితేలుతున్నారు. గ్రాండ్ డాటర్ కు వెల్కమ్ చెబుతూ ఇంతకుముందే ట్వీట్ చేసిన చిరు ముద్దుల మనవరాలిని చూడటానికి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. ఈ వార్త తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతేకాదు తమ కుటుంబానికి ఎంతో ఇష్టమైన రోజే మనవరాలు జన్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు.


మంగళవారం తెల్లవారుజామున..


ఉపాసన డెలివరీ డేట్ ప్రకటించినప్పటినుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డెలివరీకు రోజులు దగ్గరపడుతున్నకొద్దీ మెగా ఫ్యామిలీతో పాటు అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అందరూ అనుకున్నట్టుగానే మంగళవారం (జూన్ 20) తెల్లవారుజామున 4 గంటలకు ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ మేరకు అపోలో వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ ను ప్రకటించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు బులిటెన్ లో పేర్కొంది. దీంతో మెగా ఇంట సంబరాలు మొదలైయ్యాయి. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తాము ఆంజనేయ స్వామిని ఆరాధిస్తామని, ఆ స్వామికి ఇష్టమైన రోజైన మంగళవారం నాడు పాప పుట్టడం సంతోషంగా ఉందన్నారు చిరు. 


హనుమంతుడే ఆరాధ్య దైవంగా..


మెగా ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఆ కుటుంబం ఎక్కువగా ఆంజనేయ స్వామిను కొలుస్తూ ఉంటారు. వాస్తవానికి చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ కానీ సినిమాల్లోకి వచ్చాక చిరంజీవి అని మార్చుకున్నారు. ఈ పేరు మార్పు గురించి పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారు కూడా. తర్వాత చాలా సినిమాల్లో చిరంజీవి కూడా హనుమంతుడి భక్తుడిగానూ కనిపించారు. అలాగే హనుమంతుడి పాటలు, ఆయన పేరును కూడా పలు సినిమాలకు పెట్టిన సందర్బాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆంజనేయుడిని ఎక్కువగా పూజిస్తారు. ఇక రామ్ చరణ్ పెట్టిన కొణిదెల ప్రొడక్షన్ లోగో కూడా హనుమాన్ ప్రతిమ వచ్చేలా పెట్టడం విశేషం. ఇలా ప్రతీ సందర్భంలోనూ మెగా ఫ్యామిలీ హనుమంతుడిని తలచుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మెగా గ్రాండ్ డాటర్ కూడా ఆ హనుమంతుడికి ప్రీతిపాత్రమైన మంగళవారం రోజు జన్మించడంతో మెగా ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేస్తోంది. 


మంచి ఘడియల్లో పుట్టింది, జాతకం చాలా బాగుందంటున్నారు: చిరంజీవి


మవనరాలి రాకతో మెగాస్టార్ చిరంజీవి తాతయ్య పోస్ట్ కు ప్రమోట్ అయ్యారు. తన ముద్దుల మనవరాలిని చూడటానికి ఆసుపత్రికి కూడా వెళ్లారు చిరు. మహాలక్ష్మి రాక తమ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపిందన్నారు చిరంజీవి. పాప మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా చాలా బాగుందని అంటున్నారని పొంగిపోయారాయన. ఆ ప్రభావం ముందు నుంచీ తమ ఫ్యామిలీలో కనబడుతుందని చెప్పారు. రామ్ చరణ్ స్టార్ డమ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం, వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఇలా అన్నీ శుభాలే జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట. 


Also Read : రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు... ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే