టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూకుడుమీదున్నారు. ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే మరో చిత్రాన్ని లైన్ లో పెడుతూ, బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ తో దూసుకుపోతున్నారు. ఆరు పదులు దాటిన వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ, రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ దర్శకులను ఎక్సేంజ్ చేసుకుంటున్నారని వారి లైనప్ చూస్తే అర్థమవుతుంది. 


చిరంజీవి హీరోగా కొల్లు రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెంటనే బాలయ్యతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు డైరెక్టర్ బాబీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో #NBK109 వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ మూవీని అఫిషియల్ గా లాంచ్ చేశారు. 


మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే డైరెక్టర్ అనిల్ దీని తర్వాత చిరుతో ఓ సినిమా చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇది మెగాస్టార్ కెరీర్ లో 157వ చిత్రం అవుతుందని అంటున్నారు. 


Also Read: సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలీవుడ్.. సౌత్ పాన్ ఇండియా సినిమాలకు గడ్డుకాలం ఎదురుకానుందా?


'భోళా శంకర్' సినిమాని రిలీజ్ కు రెడీ చేసిన చిరంజీవి.. తన తదుపరి చిత్రాన్ని 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేయనున్నారని చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందే ఈ మూవీకి బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించనున్నారని సమాచారం. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికి చిరు ఆసక్తి కనబరుస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే #Mega157 ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. 


ఇలా చిరంజీవిని డైరెక్ట్ చేసిన కొల్లు బాబీ, బాలయ్యతో సినిమా చేస్తుంటే.. బాలకృష్ణతో మూవీ చేస్తున్న అనిల్ రావిపూడి, త్వరలో చిరుతో ఓ సినిమా చేయనున్నారట. ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు అగ్ర కథానాయకులు, ఈ విధంగా ఒకరికొకరు తమ దర్శకులను ఎక్సేంజ్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో బాలయ్యతో పని చేసిన దర్శకులు కొందరు చిరంజీవితో సినిమాలు చేశారు.. అలానే చిరుతో వర్క్ చేసిన డైరెక్టర్లు బాలయ్యతో మూవీస్ తీశారు. కాకపోతే ఈసారి వెంటవెంటనే దర్శకులను మార్చుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.  


చిరు, బాలయ్యలు 2023 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీరసింహా రెడ్డి' సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఒకే నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడటం అనేది తెలుగు సినీ పరిశ్రమలోనే అరుదైన సంఘటన. ఇక్కడ ఈ రెండు సినిమాలూ మంచి విజయాలు సాధించడం గమనార్హం. కాకపోతే బాక్సాఫీస్ లెక్కల ప్రకారం బాలకృష్ణపై చిరంజీవి పైచేయి సాధించారని చెప్పాలి. 


Also Read: రీల్ హీరో to రియల్ హీరో: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?


Join Us on Telegram:https://t.me/abpdesamofficial