Chhota Bheem Trailer Is Out Now: యానిమేషన్ మేకర్స్ క్రియేట్ చేసిన అందరు సూపర్ హీరోల్లో చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన సూపర్ హీరో ‘ఛోటా భీమ్’. ఇప్పటికే ఈ క్యారెక్టర్‌పై పలు యానిమేషన్ సిరీస్‌లు, సినిమాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఈ క్యారెక్టర్ ఆధారంగా బాలీవుడ్‌లో ఒక హై బడ్జెట్ ఫీచర్ ఫిల్మ్ రానుంది. అదే ‘ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఛోటా భీమ్.. దమ్యాన్ అనే విలన్‌తో పోటీపడనున్నాడు. కానీ దమ్యాన్ మనిషి కాదు.. ఒక పాము. ఇది ఫీచర్ ఫిల్మ్ అయినా కూడా ఇందులో పిల్లలకు నచ్చే చాలా ఎలిమెంట్స్‌ను యాడ్ చేశారు మేకర్స్.
1000 ఏళ్ల తర్వాత..
సోనాపూర్ అనే గ్రామంలో ‘ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్’ కథ మొదలవుతున్నట్టుగా ట్రైలర్‌లో చూపించారు. సోనాపూర్‌లోని ప్రజలను దమ్యాన్ అనే రాక్షస పాము తన స్వాధీనం చేసుకుంటుంది. దీంతో సోనాపూర్‌ను కాపాడడం కోసం ఆ పామును శాశ్వతంగా భూమిలోకి వెళ్లిపోవాలని శాపం పెడతారు అక్కడి ప్రజలు. అలా ఆ పాముతో పాటు సోనాపూర్ మొత్తం భూమి లోపలికి వెళ్లిపోతుంది.
1000 ఏళ్ల తర్వాత ఢోలక్‌పూర్ అనే గ్రామంలో మన సూపర్ హీరో ఛోటా భీమ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఊరి ప్రజలతో సాన్నిహిత్యంగా ఉంటూ, తన స్నేహితులతో కలిసి ఎప్పుడూ అల్లరి చేస్తుంటాడు భీమ్. ‘ఢోలక్‌పూర్‌కు వచ్చే ప్రతీ సమస్యకు నేను అడ్డుగోడగా మారుతాను’ అంటూ ఛోటా భీమ్.. తన ఊరిని, అక్కడి ప్రజలను కాపాడుతూ ఉంటాడు.
శతాబ్దంలో ఒక్కడు..
ఇంతలోనే శాపం నుంచి విముక్తి పొందిన దమ్యాన్.. మళ్లీ భూమిపైకి వస్తాడు. తన చుట్టూ ఉండే అనుచరుల సాయంతో రాజు కావాలని అనుకుంటారు దమ్యాన్. అప్పట్లో సోనాపూర్‌గా ఉన్న గ్రామం.. ఇప్పుడు ఢోలక్‌పూర్‌గా మారుతుంది. ఢోలక్‌పూర్‌ను స్వాధీనం చేసుకొని, దానికి రాజుగా మారాలనుకున్న దమ్యాన్‌కు ఛోటా భీమ్ అడ్డుపడతాడు. అప్పుడే తనకు సూపర్ పవర్ వచ్చి సూపర్ హీరోగా మారుతాడు. ‘‘వేరేవాళ్ల ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని మనిషి ఒకడు ఉంటాడు. అలాంటి పిల్లవాడు శతాబ్దంలో ఒక్కడే పుడతాడు’’ అంటూ ఛోటా భీమ్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తారు అనుపమ్ ఖేర్.
పాత్రకు న్యాయం..
అలా ఛోటా భీమ్.. దమ్యాన్ లాంటి రాక్షసుడితో పోరాడి తన ఊరిని, ప్రజలను ఎలా కాపాడుకుంటాడు అన్నదే సినిమా కథ అని ‘ఛోటా భీమ్’ ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు. ఇక ఈ ఫీచర్ ఫిల్మ్‌లో పిల్లలకు నచ్చే విధంగా గ్రాఫిక్స్‌ను కూడా డిజైన్ చేశారు మేకర్స్. ఛోటా భీమ్ అంటే ఎప్పుడూ సరదాగా ఉండాలి, తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి. అలాంటి క్యారెక్టర్‌కు యగ్యా భాసిన్ పూర్తిగా న్యాయం చేసినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. తనతో పాటు అనుపమ్ ఖేర్, మకరంద్ దేశ్‌పాండే, కభీర్ షేక్, అద్విక్ జైస్వాల్, దైవిక్ దవార్, ఆష్రియా మిష్రా వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఛోటా భీమ్’ను రాజీవ్ చిలక డైరెక్ట్ చేశారు. మే 24న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
Also Read: బిజీ బిజీగా రణ్‌బీర్.. ఇటు 'రామాయణ', త్వరలోనే 'లవ్ అండ్ వార్'