ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా.. ‘యానిమల్’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఎంతమంది ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకుందో.. అంతే కాంట్రవర్సీలను కూడా క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ కాంట్రవర్సీల వల్లే సినిమా చూడని వారికి కూడా ‘యానిమల్’ గురించి తెలుస్తోంది. ఇది సమాజానికి మంచి చేసే సినిమా కాదని చాలామంది వాదన. తాజాగా ‘యానిమల్’ గురించి చర్చ సోషల్ మీడియా నుంచి పార్లమెంటు వరకు వెళ్లింది. పార్లమెంటులో ఒక మహిళా ఎంపీ ‘యానిమల్’ గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంటులో ‘యానిమల్’ చర్చ..
సందీప్ రెడ్డి వంగా.. ‘యానిమల్’లో రణబీర్ కపూర్ క్యారెక్టర్‌ను మరీ బోల్డ్‌గా డిజైన్ చేశాడు. ఇక ఆ క్యారెక్టర్ చేసే పనులు, డైలాగులు కూడా అంతే బోల్డ్‌గా ఉంటాయి. అందుకే కొందరు ప్రేక్షకులు దీనిని ప్రశంసిస్తుంటే.. కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ఎంపీ రంజీత్ రంజన్.. పార్లమెంటులో ‘యానిమల్’ మూవీని ఖండించారు. తన కూతురు ఈ సినిమాకు వెళ్లి థియేటర్ నుంచి ఏడుస్తూ బయటికి వచ్చిందని అన్నారు. ‘‘సినిమా అనేది సమాజానికి అద్దంలాంటిది. మనం అవి చూస్తూనే పెరిగాం. సినిమాలు చూసి యూత్ చాలా ప్రభావితం అవుతారు. కానీ ఈరోజుల్లో ‘కబీర్’, ‘పుష్ప’, ‘యానిమల్’లాంటి సినిమాలు వస్తున్నాయి’’ అంటూ ‘యానిమల్’ను ఒక బ్యాడ్ సినిమాకు ఉదాహరణగా చూపించారు రంజీత్ రంజన్.
పిల్లలపై తీవ్ర ప్రభావం..
‘‘నా కూతురు తనతో కాలేజ్‌లో చదివే అమ్మాయిలతో ‘యానిమల్’ సినిమాకు వెళ్లింది. తను సెకండ్ ఇయర్ చదువుతోంది. తను సగం సినిమా మధ్యే ఏడ్చి బయటికి వచ్చేసింది’’ అంటూ.. ‘యానిమల్’ మూవీ చూసి తన కూతురు ఎలా రియాక్ట్ అయ్యిందో బయటపెట్టారు రంజీత్ రంజన్. ‘అందులో చాలా హింస, మహిళలపై వేధింపులు మాత్రమే ఉన్నాయి. సినిమాల్లో అలాంటివి చూపించడం నాకు నచ్చదు. ‘కబీర్ సింగ్’ను చూడండి.. తను భార్యను, సమాజాన్ని, తోటి మనుషులను ఎలా ట్రీట్ చేస్తాడో.. పైగా అలాంటి ఎన్నో సినిమాలు అలాంటి పాత్రలే కరెక్ట్ అని చూపిస్తున్నాయి. ఇది కచ్చితంగా ఒక ఆలోచనను రేకెత్తించే అంశం. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు 11, 12వ తరగతులు చదువుతున్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వాటిని రోల్ మోడల్‌లాగా అనుకోవడం ప్రారంభిస్తున్నారు. సినిమాల్లో ఎలాంటి హింస కనిపిస్తుందో.. సమాజంలో కూడా అలాగే జరుగుతోంది’ అని రంజీత్ వాపోయారు.
ఆ పాట వెనుక అంత గొప్ప చరిత్ర..
‘యానిమల్’లో ఉపయోగించిన ‘అర్జన్ వాల్లే’ అనే పాటను కూడా రంజీత్ ఖండించారు. అంతే కాకుండా ఈ సినిమాలో కాలేజ్‌లోకి పెద్ద పెద్ద ఆయుధాలను తీసుకొచ్చి మనుషులను చంపడాన్ని చూపించారని, ఏ చట్టం కూడా తనను శిక్షించడానికి ముందుకు రాదని గుర్తుచేశారు. సినిమాలో అలా చూపించడం కరెక్ట్ కాదు అన్నారు. ‘‘అర్జన్ వాల్లే పాట విషయానికొస్తే.. సిక్ ఫోర్స్‌కు హరి సింగ్ నల్వా కమాండర్‌గా వ్యవహరించేవారు. ఆయన బ్రిటీష్‌కు వ్యతిరేకంగా, మోఘల్స్‌కు వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు. తన కుమారుడు అర్జన్ సింగ్ నల్వా కూడా 1947లో పాకిస్థాన్ గుజారా నుంచి ఎంతోమంది ముస్లింలను కాపాడారు. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్న అర్జన్ పేరును ఉపయోగించి ‘యానిమల్’లో పాటను చాలా తప్పుగా చూపించారు. ఇది మతపరమైన నమ్మకాలను కూడా హర్ట్ చేస్తుంది’’ అని రంజీత్ అన్నారు.
Also Read: ‘యానిమల్’లో వివాదానికి దారితీస్తున్న 5 సీన్లు ఇవే - అంత దారుణంగా ఉన్నాయా?