Anitha chowdhary: సినీ పరిశ్రమలో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు అనిత. నాగార్జునలాంటి సీనియర్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అనిత.. చాలాకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. దాంతో ఎన్నో ఏళ్ల క్రితమే ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా అనిత నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువే.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత.. తను నటించిన సినిమాలను, కలిసి పనిచేసిన హీరోలను, దర్శకులను గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా అంత తక్కువ సినిమాలు చేసి తనకు తాను ఆర్టిస్ట్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదేమో అని వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు.


యంగ్ జనరేషన్‌తో పనిచేయలేదు..


‘‘ఇక్కడే ఉండి వర్క్ చేసుంటే చాలామందితో చేసేదాన్ని. 100లో పదిమందితోనే వర్క్ చేశాను. చాలా బెంగ వచ్చేసింది నాకు. నేను ఎలా ఆర్టిస్ట్ అని చెప్పుకుంటున్నాను? నేను సినిమా ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. ఆ జనరేషన్ వాళ్లతో పనిచేశానని చాలా గర్వంగా ఉంది. యంగ్ జనరేషన్‌తో చేయలేదు’’ అంటూ వాపోయారు అనిత. ‘‘రాజశేఖర్ నన్ను హీరోయిన్ అని పిలుస్తారు. ఆయన చాలా గ్రేట్. ఆయన పక్కన భార్య పాత్రలో చేశాను. అయినా అందరికీ మన హీరోయిన్ అని చెప్పుకుంటారు. ఒక్క సినిమా భార్య పాత్ర మాత్రమే చేశాను అంటే.. భార్య పాత్ర అంటే హీరోయినే కదా అంటారు’’ అని హీరో రాజశేఖర్ గొప్పదనం గురించి బయటపెట్టారు.


చాలామందితో వర్క్ చేయాలి..


తను పనిచేసిన డైరెక్టర్ల గురించి గుర్తుచేసుకుంటూ.. చాలామంది మంచి డైరెక్టర్లతో వర్క్ చేశానని, ఇంకా చాలామందితో చేయలేదని చెప్పుకొచ్చారు అనిత. పూరీ జగన్నాధ్‌తో పని చేయకపోయినా.. తన కుటుంబంతో చాలా క్లోజ్ అన్నారు. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ గురించి, పెళ్లి గురించి చెప్పుకొచ్చారు అనిత. ‘‘ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని ఏం లేదు. ముందుగా నాకొకసారి ప్రపోజ్ చేశాడు. నేను హైదరాబాద్‌ను వదిలి ఏ ఖండానికి రానని చెప్పేశాను. పెళ్లి అంటే నాకు అప్పట్లో అంత అవగాహన లేదు. ఎందుకంటే మా కుటుంబంలో జరిగిన సంఘటనలతో పెళ్లి మీద ఆసక్తి లేదు’’ అని పెళ్లి మీద తనకున్న అభిప్రాయం గురించి బయటపెట్టారు అనిత. తనకు ఉన్న నెగిటివ్ అభిప్రాయం అంతా సూపర్‌స్టార్ కృష్ణను చూసిన తర్వాతే మారిందని అన్నారు.


కృష్ణను చూసి అభిప్రాయం మారింది..


‘‘మహేశ్ బాబు తల్లిని, విజయనిర్మలను ఒకేవిధంగా చూసేవారు కృష్ణ. నెగిటివిటీ అనేది ఉండేది కాదు. ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడరు. వారిని చాలా బాగా చూసుకుంటారు. ఇలా కొన్ని చూసిన తర్వాత పెళ్లి మీద నా అభిప్రాయం మారింది. నాకు పెళ్లి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మా ఆయన ప్రపోజ్ చేశారు. పెళ్లి గురించి తర్వాత కానీ నన్ను భరించే శక్తి నీకు లేదు అని చెప్పాను. నాకు మా అమ్మ మీద బాధ్యత ఉంది. అందుకే ఇండియా దాటి ఎక్కడికీ వెళ్లను అని చెప్పేశాను. అయినా కొన్నేళ్లు ఆగి మళ్లీ ప్రపోజ్ చేశారు. అప్పుడు పెళ్లికి ఒప్పుకున్నాను’’ అని పెళ్లి కథను వివరించారు అనిత. తన తండ్రి గురించి చెప్తూ.. 5వ తరగతి తర్వాత తన తండ్రితో కలిసిలేమని, ఆయన ఎప్పుడు చనిపోయారో, అసలు చనిపోయారో లేదో కూడా తెలియదని తెలిపారు. తన తల్లి చాలా రిచ్ అని, అయినా తన తండ్రి కోసం అందరినీ వదిలేసి వచ్చి, అయిదుగురు పిల్లల్ని పెంచడానికి ఒంటరిగా కష్టపడిందని తన తల్లి గురించి బయటపెట్టింది అనిత.


శ్రీకాంత్‌కు కజిన్ అవుతాడు..


తల్లి పడిన కష్టాలను చూసిన తర్వాత తనకు పెళ్లిపై, ప్రేమపై ఆసక్తి పోయిందని అనిత తెలిపారు. చిన్నప్పుడే తండ్రికి దూరమవ్వడం వల్ల ఇండస్ట్రీలోని చాలామంది నటులను నాన్న అని పిలిచేదాన్ని అని చెప్పారు. అందుకే తనకు పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు తండ్రిలాగా భావించిన అందరి అభిప్రాయాలను తీసుకున్నానని బయటపెట్టారు. తన భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. ‘‘మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హీరో శ్రీకాంత్‌కు కజిన్ అవుతాడు. ఆయన ఫోన్ చేసి అమెరికా నుంచి మా కజిన్ వచ్చాడు, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అన్నారు. నన్ను అడగకుండా వాళ్ల ఇంట్లో చెప్పారా అనుకున్నాను. దానివల్ల పెద్ద గొడవలు కూడా అయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మేము మాట్లాడుకోలేదు’’ అని పెళ్లికి ముందు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకున్నారు అనిత.


Also Read: వాళ్లకు ఆ కోరికలు ఉండవా? సందీప్ రెడ్డి వంగాపై ‘యానిమల్’ స్క్రీన్‌రైటర్ గజల్ ఘాటు వ్యాఖ్యలు