Animal Screenwriter Gazal Dhaliwal : ఇప్పటికీ సినీ పరిశ్రమలో రైటర్స్‌కు తగినంత గుర్తింపు రాకపోవడంపై ఎంతోమంది రైటర్స్ నోరువిప్పారు. రైటర్స్‌కు ఆర్థికంగా న్యాయం అందించే విషయంలో మాత్రమే కాకుండా క్రెడిట్స్ ఇచ్చే విషయంలో కూడా ఫిల్మ్ మేకర్స్ విఫలమవుతున్నారని ఎంతోమంది ఖండించారు. తాజాగా ‘యానిమల్’ విషయంలో కూడా అదే జరగడం సంచలనంగా మారింది. బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో కూడా సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. అయితే ‘యానిమల్’కు సందీప్ మాత్రమే రైటర్‌గా పనిచేయలేదని, తాను కూడా స్క్రీన్ రైటర్‌గా పనిచేశానని, కానీ తనకు క్రెడిట్ ఇవ్వలేదని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది గజల్ ధాలివాల్.


స్క్రీన్‌రైటర్ కోణంలో..


గజల్ ధాలివాల్.. ఇప్పటికే పలు హిందీ చిత్రాలకు స్క్రీన్‌రైటర్‌గా, కో రైటర్‌గా పనిచేసింది. తనకు ‘యానిమల్’తో పెద్ద బ్రేక్ దొరుకుతుంది అని భావించినా.. కనీసం క్రెడిట్ కూడా దక్కకపోవడంతో డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాపై ఫైర్ అయ్యింది. ఈ సినిమాపై వినిపిస్తున్న విమర్శలపై కూడా గజల్ స్పందించింది. ‘‘నేను యానిమల్ పార్టీలో కాస్త లేట్‌గా జాయిన్ అయ్యాను. ఇప్పటికే పలువురు క్రిటిక్స్.. సినిమాలో ఉన్న స్త్రీ ద్వేషం, పురుషాహంకరంపై తమ అభిప్రాయాలను వినిపించారు. అందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఈ సినిమా కోసం స్క్రీన్ వెనకాల పనిచేసిన ఒక వ్యక్తి గురించి చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక స్క్రీన్‌రైటర్ కోణం నుంచి ఇదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను’’ అంటూ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చింది గజల్ ధాలివాల్.


పవర్ కావాలి..


‘‘చాలామంది ఫిల్మ్ మేకర్స్.. తమ సినిమాకు ఇతర స్క్రీన్‌ప్లే రైటర్స్, డైలాగ్ రైటర్స్ పనిచేసినా కూడా టైటిల్‌పై తామే ‘రైటర్’ అని క్రెడిట్ ఇచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది. మన ప్రపంచంలో ఇలా చాలా జరుగుతూ ఉంది. ఈ ఫిల్మ్ మేకర్స్ అందరూ పవర్ కావాలి అనే కోరికలో మునిగిపోయింటారు. డైరెక్టర్ అనే పదవి పవర్‌ఫుల్ అయినా కూడా రైటర్ అని క్రెడిట్ ఇచ్చుకోవడమే గొప్ప అనుకుంటారు. అదే వారికి ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఒక రైటర్‌గా తమకు క్రెడిట్ దక్కాలి అనుకుంటే కో రైటర్, ఎడిటర్, డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు లేదా స్టోరీ, ఎడిటింగ్, డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు’’ అంటూ రైటర్ అనే ట్యాగ్ కోసం డైరెక్టర్స్ ఎలా ఆశపడతారో బయటపెట్టింది. 


మగవారిపై కవితలు..


‘‘సినిమాలో నాకు నచ్చని ఎన్నో అంశాలు ఉన్నా.. ముఖ్యంగా ఒక అంశం మాత్రం నా మైండ్‌లో నుంచి పోవడం లేదు. అందుకే నేను ఈ పోస్ట్ రాయాలని నిర్ణయించుకున్నాను. సినిమాలో హీరో.. తనకు తాను అల్ఫా మేల్ అని చెప్తూ.. తనలాంటి అబ్బాయిలతోనే అమ్మాయిలు కలవడానికి ఇష్టపడతారని చెప్తాడు. అలా అయితే బేటా మేల్ పరిస్థితి ఏంటి? వారికి కూడా కోరికలు ఉంటాయి కదా. అసలు ఎలాంటి పదాలు ఉపయోగించి ఈ అల్ఫా మేల్.. ఒక అమ్మాయిని తనవశం చేసుకోవాలని అనుకుంటాడు అనేది నాకు అర్థం కావడం లేదు’’ అంటూ ‘యానిమల్’లో తనకు నచ్చని విషయాన్ని షేర్ చేసుకుంది గజల్. అంతే కాకుండా తనలాంటి రైటర్స్‌కు క్రెడిట్ ఇవ్వడాన్ని ఫిల్మ్ మేకర్స్ చాలా కష్టంగా భావిస్తారని తెలిపింది. అంతే కాకుండా మగవారి గురించి తను రాసిన కవితలను కూడా ఈ పోస్ట్‌లో షేర్ చేసింది గజల్ ధాలివాల్.






Also Read: 'సలార్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ - ప్రభాస్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?