Chandrika Ravi: గత కొన్నేళ్లలో హాలీవుడ్‌లో సైతం ఒక మార్క్‌ను క్రియేట్ చేస్తున్నారు ఇండియన్ యాక్టర్లు. ఇప్పుడు అందులో మరో నటీమణి కూడా యాడ్ అవ్వనుంది. తనే చంద్రికా రవి. ‘ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు’ అనే తమిళ సినిమాలో తన యాక్టింగ్‌తో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత తెలుగులో కూడా ఏకంగా నందమూరి బాలకృష్ణ సరసన స్టెప్పులేసే ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ. ‘వీర సింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు తన పేరు మీదే ఒక అమెరికన్ రేడియో టాక్ షోను హోస్ట్ చేసే అవకాశం దక్కించుకుంది.


చంద్రికా రవి షో..


ఇండియన్ ఒరిజిన్‌కు చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి... అమెరికన్ రేడియో టాప్ షోకు హోస్ట్‌గా మారడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ షో పేరు ‘ది చంద్రికా రవి షో’. చంద్రికా గురించి తెలిసిన రుకుస్ అవెన్యూ రేడియో సామీ చంద్ ఆమెకు ఈ ఆఫర్‌ను అందించారు. తన జీవితం గురించి, అందులో తను ఎదురైన అనుభవాల గురించి అందరికీ తెలియడానికి ఇదే మంచి అవకాశం అనుకున్న చంద్రికా... వెంటనే ఆ ఆఫర్‌ను యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. ‘‘కొన్నేళ్లుగా నేను నా టాక్ షో గురించి వర్క్ చేస్తున్నాను. ఏదో ఒకరోజు అది నిజమవుతుంది అని అనుకున్నాను. ఫైనల్‌గా నిజమవుతోంది’’ అని చంద్రికా చెప్పుకొచ్చింది. ఈ షోను తాను హోస్ట్ చేయడంతో పాటు కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తోంది.


ఇదే మొదటిసారి..


అమెరికాలోని అతి పెద్ద నెట్‌వర్క్స్‌లో ఒకటైన ఐహార్ట్ రేడియోలో ది చంద్రికా రవి షో వినిపించనుంది. ఈ షోను ప్రమోట్ చేయడం కోసం చంద్రికా రవి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ‘‘ఇప్పటివరకు విడుదలయిన చాలా వరకు ప్రమోషన్స్‌ను నేనే ఎడిట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. ఇది చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. దీనివల్ల కాస్త ఒత్తిడి అనిపిస్తోంది కానీ చాలా సంతోషంగా కూడా ఉంది. కెమెరా వెనుక ఉండడం అనేది నాకొక కొత్త అనుభవం. ఇన్నేళ్లలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు అసలు నేను ఎవరు అని ప్రేక్షకులకు తెలుస్తుంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది చంద్రికా రవి. సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందు చంద్రికా రవి.. రేడియోలో ఎన్నో లైవ్ షోలు, టీవీలో కూడా పలు షోలను హోస్ట్ చేసింది. 


చివరి వ్యక్తిని కాదు..


ప్రేక్షకులతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం చంద్రికాకు ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు అదే తరహాలో అమెరికాలో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి ఇండియన్ ఉమెన్‌గా రికార్డ్ సాధించింది. ‘‘ఇందులో నేను మొదటి వ్యక్తి అయ్యిండొచ్చు కానీ చివరి వ్యక్తి మాత్రం కాదు. కేవలం నా వాయిస్‌తోనే ఈ ప్రపంచానికి నేనేంటో చెప్పగలగడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తెలిపింది చంద్రికా రవి. ది చంద్రికా షో అనేది అమెరికాలోని పెద్ద నెట్‌వర్క్స్ అయిన ఐహార్ట్ రేడియో, రుకుస్ అవెన్యూ రేడియోలో ప్రతీ గురువారం ఉదయం 7.30కు ప్రసారమవుతుంది. అంతే కాకుండా ప్రతీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో కూడా విడుదల కానుంది.


Also Read: పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై మాజీ భార్య రేణు దేశాయ్‌ ఊహించని కామెంట్స్‌ - గ్లాస్‌ గుర్తు సింబాలిక్‌గా‌ ఆద్య వీడియో..