Thalapathy Vijay: 2024 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగుర వేశారు. 69 వేల ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థి, వైయస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ హీరో విజయ్ సైతం జనసేనానికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. పవన్ ఏపీలో జనసేనను రెండవ అతిపెద్ద పార్టీగా మార్చారని ప్రశంసించారు.


ఇళయ దళపతి విజయ్ తన 'ఎక్స్' లో పోస్ట్ పెడుతూ.. "అసెంబ్లీ ఎన్నికల్లో మీ అఖండ విజయంతో పాటు జనసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు పవన్‌ కల్యాణ్‌ గారికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడంలో మీ ఓర్పు, అంకితభావం మెచ్చుకోదగినవి. అందుకు మీకు శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. అలానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా తన విషెస్ అందజేశారు. 






"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించినందుకు తెలుగుదేశం పార్టీకి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. మీ దూరదృష్టి గల నాయకత్వంలో ఏపీ ప్రజలు గొప్ప పురోగతిని సాధించాలని కోరుకుంటున్నాను" అని విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీ అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేశారు.






సినీ, రాజకీయ రంగంలో హీరో విజయ్, పవన్ కల్యాణ్‌ లకు సారూప్యతలు ఉన్నాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ పవన్ నటించిన తెలుగు సినిమాలను విజయ్ తమిళంలో రీమేక్ చేస్తే, అక్కడ విజయ్ నటించిన చిత్రాలను ఇక్కడ పవన్ రీమేక్ చేసి విజయం సాధించారు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్.. పవన్ మాదిరిగానే పాలిటిక్స్ లోకి వచ్చారు. 'తమిళగ వెట్రి కజగం' (TVK) పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. 


తమిళ నటులు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమీ కాదు. అయితే హీరో విజయ్ తన సమయాన్ని పూర్తిగా ప్రజా సేవకే కేటాయించడానికి ఇకపై సినిమాల్లో నటించనంటూ ప్రకటించడం ఆయన అభిమానులతో పాటుగా, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు విజయ్ పేర్కొన్నారు. వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. 


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో విజయ్ ఒకరు. అయితే ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించిన స్టార్‌డమ్‌ను ఇప్పుడు పొలిటికల్ జర్నీ కోసం విడిచిపెట్టాలని విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం రాజకీయ వర్గాల్లో, ఫిల్మ్ సర్కిల్‌లలో పెద్ద చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ సైతం జనసేన పార్టీ స్థాపించినప్పుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నట్లు ప్రకటించారు. కానీ గత ఎన్నికలలో ఘోర ఓటమి చవిచూసిన తర్వాత, తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ వచ్చారు. ఓవైపు నటిస్తూనే మరోవైపు రాజకీయాలు చేసి అధ్బుతమైన విజయం సాధించారు. మరి ఇక్కడ విజయ్ ప్రయాణం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.