Chandrababu Biopic Telugodu: ఇప్పుడు ఏపీలో ఎన్నికల హీట్ నడుస్తోంది. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పొలిటికల్ సినిమా హీట్ కూడా నడుస్తోందని చెప్పాలి. ఇప్పటికే వ్యూహం, శపథం, యాత్ర - 2 లాంటి సినిమాలు రిలీజైతే.. ఇప్పుడిక ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బయోపిక్ 'తెలుగోడు' తీశారు. ఆ సినిమాని య్యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా య్యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది. సినిమా వివరాలు ఒకసారి చూద్దాం.
విజనరీ లీడర్..
నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన్ని అందరూ విజనరీ లీడర్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావితరాల భవిష్యత్తు కోసం చేపట్టిన డవలప్ మెంట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ విషయాలనే ఈ సినిమాలో తెరకెక్కించారు మేకర్స్. 'తెలుగోడు'. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో సినిమా తెరకెక్కింది. డాక్టర్ వెంకీ మేడసాని కథ, కథనం, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహించారు ఈసినిమాకి. గురువారం ఉదయం ఈ సినిమాని యూట్యూబ్‌లో విడుదల చేశారు.
చంద్రబాబుపై అభిమానంతో..
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జన్ వెంకీ మెడసాని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సినిమా ఫీల్డ్ లో ఎలాంటి అనుభవం లేనప్పటికీ.. కేవలం చంద్రబాబుపై అభిమానంతో ఈ సినిమా తెరకెక్కించారు ఆయన. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామాజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా. అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు? అనేది 'తెలుగోడు' కాన్సెప్ట్. ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా" అని డైరెక్టర్ అన్నారు.
ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని అనుకున్నానని చెప్పారు వెంకీ మెడసాని. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిస్తే.. రాజకీయ నాయకుడి సినిమా తీస్తే విజయం సాధించదని అన్నారు. కానీ, "నా కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్ రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది'' అని చెప్పారు. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో వినోద్ నటించగా.. ఛాయాగ్రహణం మల్లిక్ చంద్ర, సంగీతం రాజేష్ రాజ్, కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - ప్రొడ్యూసర్ డాక్టర్ వెంకీ మేడసాని.
Also Read: విజయ్ దేవరకొండతో 'బాహుబలి' రేంజ్ హిస్టారికల్ సినిమా!