Yevam Trailer Is Out Now: అన్ని జోనర్లలోనూ ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా చూసే జోనర్ క్రైమ్ థ్రిల్లర్. అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ అయిన ‘యేవమ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది చాందిని చౌదరీ. అమ్మాయిలను చంపేసే సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడానికి చాందిని సిద్ధమయ్యింది. తాజాగా ‘యేవమ్’ ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్‌లో సినిమా కథను పూర్తిగా రివీల్ చేయకుండా కాస్త సస్పెన్స్ మెయింటేయిన్ చేస్తూ ప్రేక్షకులకు మూవీపై ఆసక్తి పెరిగేలా చేశారు మేకర్స్.


దమ్ముండాలి..


ముందుగా పీఎస్ఐ సౌమ్యగా వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో చాందిని చౌదరీ జాయిన్ అవ్వడంతో ‘యేవమ్’ ట్రైలర్ మొదలవుతుంది. అక్కడే సీఐగా ఉన్న భరత్ రాజ్.. తనను ఫైల్స్ సెక్షన్‌లో వేయమంటాడు. పోలీస్‌గా ఏదో సాధించేయాలని వచ్చిన సౌమ్యకు ఫైల్స్ సెక్షన్ నచ్చదు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా ‘‘ఆడపిల్లలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు’’ అంటూ సౌమ్య తండ్రి హేళన చేస్తారు. వేరే దారిలేక స్టేషన్‌లో ఉండే అందరితో స్నేహం చేయడం మొదలుపెడుతుంది సౌమ్య. బాబాయ్ అంటూ సీనియర్లతో కలిసిపోతుంది. ఈ విషయం సీఐకు నచ్చకపోవడంతో తనను కూడా ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అవుతుంది. ‘‘పోలీస్ ఉద్యోగం అంటే అందరి వల్ల అయ్యేదేనా గుండెల్లో దమ్ముండాలి’’ అంటూ సౌమ్య తండ్రి.. హీరోతో చెప్తాడు. కానీ ‘‘గుండెల్లో ప్రేముంటే చాలు’’ అని హీరో కౌంటర్ ఇస్తాడు. 


ప్రభాస్‌తో డిన్నర్..


ఆడవాళ్లకు అంచనాలు అనేవి ఎక్కువ అనే మనస్థత్వంతో ఉంటాడు హీరో. అయినా తెలియకుండానే హీరోయిన్‌కు దగ్గరయిపోతాడు. దాని తర్వాత ‘యేవమ్’ ట్రైలర్.. పూర్తిగా వేరే జోనర్‌లోకి మారుపోతుంది. ‘ప్రభాస్‌తో డిన్నర్’ అని చెప్తూ అమ్మాయిలను టార్గెట్ చేస్తుంటాడు ఓ సీరియల్ కిల్లర్. ప్రభాస్ పేరు చెప్పగానే కొందరు అమ్మాయిలు ముందు, వెనుక ఆలోచించకుండా వచ్చి తన చేతిలో హత్యకు గురవుతారు. విలన్‌గా ‘యేవమ్’ ట్రైలర్‌లోకి ఎంటర్ అవుతాడు వశిష్ట. ఆ విలన్‌కు కూడా ఒక వీక్‌నెస్ ఉంటుంది. తనే అషు రెడ్డి. ‘‘నువ్వు నన్ను ఎప్పటికీ తాకలేవు’’ అంటూ వశిష్టను దూరం పెడుతుంది అషు. 


ఆర్డినరీ కిల్లర్..


అమ్మాయిలను చంపేస్తున్న వశిష్టను పట్టుకోవాలని చాందిని నిర్ణయించుకుంటుంది. ‘‘పొట్టి బట్టలు వేసుకుంటూ చంపేస్తే తప్పు లేదా’’ అంటూ చనిపోయిన అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుంది. తాను సీరియల్ కిల్లర్ కాదని ఒక ఆర్డినరీ కిల్లర్ అని తన గురించి తాను చెప్పుకుంటాడు వశిష్ట. ‘‘క్రైమ్‌లో పొరపాట్లు ఉండవు తప్పులు మాత్రమే ఉంటాయి’’ అనే డైలాగ్‌తో కిల్లర్ గురించి తమకు ఒక క్లూ దొరికిందని హింట్ ఇస్తాడు హీరో. ‘‘నేను అమ్మాయినే, నన్ను కాపాడుకోగలను అని ఈ సమాజానికి ఎలా చెప్పాలి’’ అంటూ చాందిని చెప్పే డైలాగ్‌తో ‘యేవమ్’ ట్రైలర్ ముగుస్తుంది. మొత్తానికి ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను చూస్తున్న ఫీలింగ్‌ను ప్రేక్షకులకు అందించారు మేకర్స్. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వం వహించిన ‘యేవమ్’.. జూన్ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.



Also Read: నా బాడీకి ఇప్పుడు అలాంటి మాసాజ్‌ కావాలి! - అనుపమ షాకింగ్‌ పోస్ట్‌, ఫోటో వైరల్‌