Case Filed Against Actress Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతి, ఆమె భర్త డేవిడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను వేధించారంటూ వారి ఇంటి పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు. తనను తీవ్ర దుర్భాషలాడారని... నగ్నంగా చేసి కొట్టేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

అసలేం జరిగిందంటే?

హీరోయిన్ డింపుల్ హయాతి ప్రస్తుతం షేక్ పేటలోని వెస్ట్ వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఒడిశా నుంచి ఇద్దరు యువతులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వారిని సరిగ్గా చూసుకోకుండా మానసికంగా, శారీరకంగా వేధించారంటూ ఆ యువతులను ఉద్యోగానికి పంపిన మహిళ ఓ వీడియో షేర్ చేయగా వైరల్ అయ్యింది. పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో డింపుల్ తిట్టించారని ఆరోపించారు. 'మా ఆయన లాయర్. మీరు మమ్మల్ని ఏం చేయలేరు? మీరెంత మీ బతుకెంత?' అంటూ అవమానించారని సదరు మహిళ వాపోయింది.

ఒడిశాకు చెందిన పని మనిషి ప్రియాంక బిబర్ (22) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లో కుక్క అరిచిందని భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని... దుస్తులు విప్పేసి తనను నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు ప్రయత్నించినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు ప్రియాంక. వీడియో రికార్డ్ చేసేందుకు యత్నించగా... డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కింద పడేశారని పేర్కొన్నారు. తనతో పని చేయించుకుని డబ్బులివ్వకుండా పంపేశారని కంప్లైంట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ  ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి.

గతంలో హీరోయిన్ డింపుల్ వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడవపడడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఆమె తీరు కాంట్రవర్శీగా మారింది. గల్ఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డింపుల్... ఖిలాడి, యురేఖ, రామబాణం సినిమాలు చేశారు. ఇక వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ మూవీలో స్పెషల్ సాంగ్ చేశారు. 

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారి'తో బ్యూటిఫుల్ 'శశిరేఖ' - 'దసరా' స్పెషల్ సర్ ప్రైజ్ కోసం వెయిటింగ్