ఓ భాషలో సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాత మరొక భాషలో రీమేక్ కావడం సహజంగా జరిగే విషయం. అరుదుగా విడుదలకు ముందు కథ, కథనాల గురించి తెలుసుకుని రీమేక్ రైట్స్ కోసం ఆఫర్స్ రావడం జరుగుతుంటుంది. 'అరి' ఆ సినిమా జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ సినిమా రీమేక్ కోసం తమిళ, హిందీ భాషల నుంచి క్రేజీ ఆఫర్స్ వచ్చాయని టాక్. 


తమిళంలో శివ కార్తికేయన్ రీమేక్ చేస్తారా?
'అరి' చిత్రానికి వి జయశంకర్ దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు ఆయన సంతోష్ శోభన్ హీరోగా 'పేపర్ బాయ్' తీశారు. అందులో 'బొంబాయి పోతావా రాజా' ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినబడుతూ ఉంటుంది. 'పేపర్ బాయ్' తర్వాత సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో బిజీ అయ్యారు. ఆ సినిమాతో దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా విజయం అందుకున్నారు. 'పేపర్ బాయ్' తర్వాత జయశంకర్ దర్శకత్వం వహించిన సినిమా 'అరి'. మై నేమ్ ఈజ్ నో బడీ... అనేది ఉపశీర్షిక.



ఆల్రెడీ విడుదలైన 'అరి' ట్రైలర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింలా ఉందని పేరు వచ్చింది. అయితే సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇటీవల 'అయలాన్' పబ్లిసిటీ కోసం హైదరాబాద్ వచ్చిన శివ కార్తికేయన్ (Sivakarthikeyan)ను జయశంకర్ కలిశారు. అప్పుడు 'అరి' ట్రైలర్ చూపించగా... తమిళంలో రీమేక్ చేయాలని ఉందని, రైట్స్ కోసం అడిగినట్టు సమాచారం.


Also Read: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు - హీరోయిన్ వర్ష ఏమన్నారంటే?


హిందీలోనూ 'అరి' రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ 'అరి' మీద ఫోకస్ చేశారట. 'పుష్ప'తో హిందీ చిత్రసీమలో చాలా మందికి అనసూయ గురించి తెలిసింది. ఆమె నటించిన సినిమా కావడంతో 'అరి' మీద ప్రముఖుల చూపు పడుతోంది. త్వరలో తెలుగులో సినిమా విడుదల కానుందని, ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.


Also Readప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?






మనిషిలోని అరిష‌డ్వ‌ర్గాలు కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుట్టూ తిరిగే కథతో 'అరి' చిత్రాన్ని రూపొందించారు. కృష్ణ తత్వాన్ని వెండితెరపై కొత్త కోణంలో జయశంకర్ ఆవిష్కరిస్తున్నారని తెలిసింది. ఇందులో సాయి కుమార్, 'శుభలేఖ' సుధాకర్, అనసూయ భరద్వాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, 'సురభి' ప్రభావతి, 'వైవా' హర్ష... ఈ ఆరుగురు ఆరు కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా సుమన్, ఆమని, 'చమ్మక్' చంద్ర, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి 'అరి' నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.