మంచు కుటుంబం మీద బ్రాహ్మణ సంఘాల చైతన్య వేదిక (Brahmana Chaitanya Vedika) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే బ్రాహ్మణులను అవహేళన చేయడం ఆ కుటుంబానికి ఆనవాయితీగా మారిందని ఆరోపణలు చేసింది.‌ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప'ను బహిష్కరించాలని పిలుపు ఇచ్చింది.

మంచి కుటుంబంతో బ్రాహ్మణులకు గొడవ ఏమిటి?Manchu Family Issue Latest: మంచు కుటుంబానికి, బ్రాహ్మణులకు మధ్య గొడవ ఈనాటిది కాదు.‌ 'దేనికైనా రెడీ'లో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గం నిరసన తెలిపింది. మంచు కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసింది. అప్పట్లో బ్రాహ్మణలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 'దేనికైనా రెడీ' సినిమాలో మూడు సన్నివేశాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు తీర్పు పక్కన పెడితే... 'దేనికైనా రెడీ'లో సన్నివేశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిలిం నగర్‌లో లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, డాక్టర్ మంచు మోహన్ బాబు నివాసాన్ని బ్రాహ్మణులు చుట్టుముట్టారు. తమపై దౌర్జన్యం చేశారని మంచు కుటుంబం, తమను రౌడీలతో కొట్టించాలని బ్రాహ్మణులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. తప్పుడు కేసులు బనాయించారని బ్రాహ్మణులు ఆరోపించగా... ఇంటి మీదకు వచ్చారని విష్ణు మంచు వివరించారు. ఆ సమస్య చాలా రోజుల కిందట ముగిసింది. ఇప్పుడు మళ్లీ 'కన్నప్ప' విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో మరోసారి మంచు కుటుంబం మీద బ్రాహ్మణులు కన్నెర్ర చేస్తున్నారు. తాజా వివాదం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

పిలక - గిలక‌... 'కన్నప్ప'లో ఆ రెండు క్యారెక్టర్లు?విష్ణు మంచు తాజా సినిమా 'కన్నప్ప'లో పిలక - గిలక క్యారెక్టర్లలో కామెడీ కింగ్ బ్రహ్మానందం - యంగ్ కమెడియన్ సప్తగిరి నటిస్తున్నారు. వాళ్ళిద్దరి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 30, ‌2024లో విడుదల చేశారు. 'చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గురువులు... అడవికి పాఠాలు చెప్పడానికి వస్తే' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

పిలక - గిలక క్యారెక్టర్ల మీద బ్రాహ్మణులు అభ్యంతరం తెలుపుతూ... గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఆ కేసు ఉంది.‌ ఇంకా తీర్పు రాలేదు. కేవలం బ్రాహ్మణులను అవహేళన చేయడం అవమానించడం కోసమే 'కన్నప్ప'లో పిలక గిలక క్యారెక్టర్లు పెట్టారని బ్రాహ్మణ సంఘాల చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలా పెట్టలేదని చెప్పే దమ్ముందా? అంటూ ప్రశ్నించింది.

'కన్నప్ప'ను బహిష్కరించి సనాతన ధర్మాన్ని కాపాడుదాం!కల్పిత కథ, కథనాలతో రూపొందిన నకిలీ 'కన్నప్ప'ను బహిష్కరించాలని ప్రజలకు బ్రాహ్మణ సంఘాల చైతన్య వేదిక విజ్ఞప్తి చేసింది. అంతే కాదు... విదేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్ నిధులతో 'కన్నప్ప' చిత్రాన్ని నిర్మించారని విమర్శించింది.

Also Readసెన్సార్, వీఎఫ్ఎక్స్ సమస్యల నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు... హరిహర వీరమల్లు వాయిదాపై ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్

'కన్నప్ప' మీద గుంటూరులోని ఏపీ హైకోర్టులో కేసు ఉంది గనుక... సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుంటూరులో నిర్వహించారని చెబుతోంది బ్రాహ్మణ చైతన్య వేదిక. దీని వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని, త్వరలో వాళ్లంతా ప్రజలకు సమాధానం చెప్పే రోజు వస్తుందని వివరించింది. నకిలీ 'కన్నప్ప'ను బహిష్కరించి సనాతన ధర్మాన్ని కాపాడాలని‌‌ బ్రాహ్మణ సంఘాల జేఏసీ, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన పట్ల, అలాగే చేసిన విమర్శల పట్ల మంచు కుటుంబం, విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: అన్నపూర్ణ స్టూడియోలో కాదు... అఖిల్ పెళ్లి ముహూర్తం నుంచి అతిథులు, వేదిక, జైనాబ్ బ్యాగ్రౌండ్ వరకూ... కంప్లీట్ డీటెయిల్స్